Nara Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజు విచారణకు హాజరయ్యారు. నిన్న దాదాపు ఆరున్నర గంటల పాటు లోకేష్ ను సీఐడీ అధికారులు విచారించారు. కాగా ఇవాళ కూడ విచారణకు రావాలని సీఐడీ కోరడంతో లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు.
నిన్న ఉదయం పది గంటలకు లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఆరున్నర గంటల విచారణ తర్వాత విచారణను ముగించారు. అయితే తనకు న్యూఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉన్నందున విచారణ ముగించాలని సీఐడీని లోకేష్ కోరారు. అయితే ఇవాళ విచారణకు రావాలని లోకేష్ కు సీఐడీ అధికారులు సూచించారు. దీంతో లోకేష్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఇవాళ సీఐడీ విచారణ పూర్తైతే లోకేష్ న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రబాబు కేసులకు సంబంధించి లోకేష్ న్యాయనిపుణులతో చర్చించనున్నారు.
మంగళవారం విచారణ అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు ఆరున్నర గంటలు విచారణ జరిగిందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అడగలేదని.. ప్రశ్నల్లో ఒక్కటి కూడా కుటుంబ సభ్యులు ఎలా బాగుపడ్డారని అడగలేదని లోకేష్ తెలిపారు. కక్ష సాధింపు తప్ప.. ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగ ఎఫ్ఐఆర్‌లు పెట్టారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని.. మళ్లీ రేపు విచారణకు హాజరవుతానని లోకేష్ స్పష్టం చేశారు. అలైన్‌మెంట్‌కు సంబంధించి ఒకే ఒక్క ప్రశ్న అడిగారని తెలిపారు. హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఏం జరిగిందో అడిగారని.. మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన జీవోఎం వివరాలు అడిగారని ఆయన వెల్లడించారు.