Nara Chandrababu Naidu : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకి ఊహించని షాక్ తగిలింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ ఇవాళ్టితో ముగియనుంది. దీంతో చంద్రబాబును వర్చువల్ గా ఏసీబీ కోర్టు ముందు హాజరుపర్చారు సీఐడీ అధికారులు. కాగా ఈ క్రమం లోనే చంద్రబాబునాయుడు రిమాండ్ ను ఈ నెల 24వ తేదీకి పొడిగించింది కోర్టు. అంతకు ముందు చంద్రబాబు, ఏసీబీ కోర్టు జడ్జి మధ్య సంభాషణ జరిగింది.
ఈ సందర్భంగా చంద్రబాబు న్యాయమూర్తితో తన అభిప్రాయాలను చెబుతూ.. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది. నోటీసు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేశారన్నారు. నా తప్పు ఉంటే విచారణ చేసి అరెస్ట్ చేయాల్సింది. నేను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఇది నా బాధ.. నా ఆవేదన.. నా ఆక్రందన. ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు. నాపై ఉన్నవి ఆరోపణలు మాత్రమే.. అవి నిర్ధారణ కాలేదు. చట్టం ముందు అందరూ సమానమే .. చట్టాన్ని గౌరవిస్తా. న్యాయం గెలవాలి’’ అని చంద్రబాబు న్యాయమూర్తితో చెప్పారు.
అనంతరం చంద్రబాబుతో న్యాయమూర్తి మాట్లాడుతూ ‘‘మీరు పోలీసు కస్టడీలో లేరు.. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మీరు దీన్ని శిక్షగా భావించొద్దు. మీపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే.. నేరనిరూపణ కాలేదు. చట్టం, నిబంధనల ప్రకారమే మీకు రిమాండ్ విధించాం. జైలులో సౌకర్యాల విషయంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? సౌకర్యాలు అవసరమైతే దానికి అనుగుణంగా ఆదేశిస్తాం. మీరు 24 వరకు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంటారు. మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అడుగుతోంది. మీ తరఫు న్యాయవాదులు కస్టడీ అవసరం లేదని వాదించారు. చట్టం ముందు అందరూ సమానమే’’ అని చెప్పారు. కోర్టు కి ఒక విధానం ఉంటుంది.. కానీ ఈ విధానాలను ఎవరూ మార్చలేరని న్యాయమూర్తి చెప్పారు. కోర్టు తన పరిధిలో పనిచేస్తుందన్నారు. జ్యూడిషియల్ కస్టడీలో ఇబ్బందులుంటే చెప్పాలని జడ్జి కోరారు. మానసికంగా బాధ పడొద్దని బాబుకు సూచించారు.