Nandamuri Balakrishna : ఎన్ని కేసులు పెట్టినా సరే న్యాయ పోరాటం చేస్తాం తప్ప ఎవడికీ భయపడేది లేదని ప్రముఖ హీరో, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రజల కోసం టీడీపీ తరఫున చేస్తున్న పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోమని తేల్చి చెప్పారు. ఇలాంటి కుట్రలు టీడీపీకి, చంద్రబాబుకు కొత్తేం కాదని అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నేపధ్యంలో బాలయ్య ఈ సంచలన ప్రెస్ మీట్ కి తెరలేపారు. చంద్రబాబుపై కేసు పెట్టడానికి ముందే ప్లాన్ చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేని దుస్థితిలో ఉన్నాము.. రాష్ట్రం టాక్సులతో బాధపడే స్థితికి వచ్చింది.. భవిష్యత్ లో ఆధారాలు లేని కేసులు చాలా పెడతారు.. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి.. జగన్ ఎందుకు విదేశాలకు వెళ్ళాడో చెప్పాలి అని బాలకృష్ణ డిమాండ్ చేశారు.
రాజకీయ కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబుపై ఈ అభియోగం మోపారని బాలయ్య అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని.. మీరు 18 నెలలు జైలులో ఉన్నారని, చంద్రబాబును 16 నెలలన్నా జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ స్కామ్‌ను క్రియేట్ చేశారని ఆరోపించారు. చట్టాలు అతిక్రమించి కేసులు పెడితే.. చూస్తు ఊరుకోమని బాలకృష్ణ అన్నారు. ప్రజలు తిరగబడాలి, ఉద్యమించాలి.. చంద్రబాబు అరెస్ట్ తో ప్రాణాలు కోల్పోతున్న కుటుంబాలను త్వరలోనే పరామర్శంచడానికి వెళ్తా.. కష్టకాలంలో ఉన్న పార్టీ కోసం నేను ముందు ఉండి పోరాడతాను అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యం లా బయటకు వస్తాడు.. ఎన్ని కేసులు పెట్టినా భయ పడేది లేదు.. ప్రజా పక్షాన పోరాటం కొనసాగుతుంది.. మాది మాటిస్తే మాట తప్పని పార్టీ టీడీపీ.. అధికారంలో ఉంటే సేవా చెయ్యాలన్న మనసు ఉండాలి అని బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు.
అప్పులు చేసి పాలన చేయడం సరికాదు.. ఆ అప్పుల భారం ప్రజలే మోయాల్సి ఉంటుంది అని నందమూరి బాలకృష్ణ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. టీడిపి ప్రభుత్వంలో యువత ప్రపంచంతో పోటీ పడిన పరిస్థితి.. ఇప్పటి ప్రభుత్వం ఉపాధి అవకాశాలను ధ్వంసం చేసి యువతను నిర్వీర్యం చేస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలుగు వాడికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు.. తెలుగు వారి గౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీనీ స్థాపిస్తే తెలుగు ప్రజల అభివృద్ధి కోసం చంద్రబాబు పోరాటం చేశారు అని బాలకృష్ణ చెప్పారు.