Andhra Pradesh: ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం కోర్టు మరోమారు రిమాండ్ ను పొడిగించింది. ఇదివరకు విధించిన రిమాండ్ గడువు శుక్రవారంతో పూర్తి కావడంతో పోలీసులు ఆయనను రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో అనంతబాబు రిమాండ్ ను అక్టోబర్ 7 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఫలితంగా తిరిగి ఎమ్మెల్సీని పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.
డ్రైవర్ హత్యకేసులో అనంతబాబు మే 23 నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మే నెల 19న రాత్రి కాకినాడలో వీధి సుబ్రహ్మణ్యం హత్య జరిగిన తరువాత దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఎమ్మెల్సీ ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మే 20న తెల్లవారుజామున ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులోనే సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడంతో అనుమానాలు వచ్చాయి.
ఎమ్మెల్సీ తమను బెదిరించారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. ఆ తర్వాత అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేయగా, సుబ్రహ్మణ్యంను హత్య చేసింది తానేనంటూ ప్రాథమికంగా ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది.