Amaravati: వ్యవసాయ విద్యుత్ మీటర్ల పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ప్రకటన చేసారు. వచ్చే మార్చి నాటికి వంద శాతం వ్యవసాయ మోటారు పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్లను బిగించినంత మాత్రానా రైతులు నష్టపోయేది ఏమీ లేదంటూ, ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దంటూ రైతులకు ఆయన విజ్నప్తి చేశారు. విద్యుత్ సబ్సిడీ మొత్తాన్ని రైతులు బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే 70శాతం మంది రైతులు డీబీటీ ఖాతాలను తెరిచిన్నట్లు మంత్రి పెద్ది రెడ్డి తెలిపారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో 30శాతం సబ్సిడీ చెల్లింపులో ప్రభుత్వానికి ఆదా అవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు.
స్మార్ట్ మీటర్ల పై రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాలు శ్రీకాకుళం వచ్చి పరిశీలించాలని పేర్కొన్నారు. ప్రయోగాత్మకంగా వచ్చిన రిజల్ట్ తోనే తాను మాట్లాడుతున్నట్లు మంత్రి స్పష్టీకరించారు. రాష్ట్రంలోని తెదేపా, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు రైతుల్లో లేని పోని అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసిన తర్వాత సబ్సిడీ ఎత్తివేస్తారన్న మాటలన్నీ ఊహా జనితంగానే మంత్రి కొట్టి పారేశారు. మీటర్ల ఏర్పాటు చేసేందుకు వస్తే అధికారులకు చేతులు నరుకుతామన్న సీపిఐ నేత నారాయణ మాటలపై మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి కేవలం రాజకీయ స్వార్ధంతోనే వారు అలా మాట్లాడుతున్నారని అన్నారు.
అయితే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న సమయంలో అసలు వ్యవసాయ కనక్షన్లకు విద్యుత్ మీటర్లు ఎందుకు అనేది రైతులు, ప్రతిపక్షాల వాదన. విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేసే క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లను ఏర్పాటు చేస్తుందన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తం అవుతుంది. 30శాతం ఆదాగా చెప్పుకొస్తున్న మంత్రి పెద్ది రెడ్డి మాటలకు వాస్తవానికి అంత తేడా ఎలా ఉంటుందన్న సందేహాలు కూడా రైతులకు కలుగుతున్నాయి.
మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మీటర్ల ఏర్పాటు ప్రక్రియతోనే, రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసే నిధులకు ముడిపడి వుండడంతో ప్రభుత్వం నానా తంటాలు పడి రైతుల మెడకు మీటర్లను ఉరితాడుగా బిగిస్తుందని మేధావుల భావిస్తున్నారు. మరో వైపు పొరుగున ఉన్న తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ మీటర్లను ఎట్టి పరిస్ధితిలోనూ అన్నదాతల మోటార్లకు బిగించేది లేదని కేంద్రంతో యుద్ధానికి దిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల్లోనే రైతుల మీటర్ల ఏర్పాటులో భిన్నాభిప్రాయలు ఉండడం పట్ల జగన్ ప్రభుత్వం చెబుతున్న వాస్తవాల్లో చాలా వ్యత్యాసాలు కనపడుతున్నాయి.
ఇది కూడా చదవండి: విస్తరణ నియామక ప్రక్రియ పై స్టే