Site icon Prime9

Kidnap : సినీ ఫక్కీలో కిడ్నాప్.. అందరూ చూస్తుండగానే కారులో ఎత్తుకెళ్లిన వైనం

kidnap incident at ibrahimpatnam goes viral

kidnap incident at ibrahimpatnam goes viral

Kidnap : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సేమ్ టూ సేమ్ సినిమాలో లాగానే ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పట్టణంలోని రింగ్ సెంటర్లో అందరూ చూస్తుండగా బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు ఓ యువకుడిపై దాడి చేసి కారులో ఎత్తుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని వెంబడించి కిడ్నాప్‌కు గురైన యువకుడిని కాపాడి.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ విచారణలోనే పోలీసులకు ఊహించని ట్విస్ట్ తెలియడం గమనార్హం. ఈ కిడ్నాప్ ఉదంతానికి గల కారణాలను విచారించగా.. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేయడంతో సదరు యువకుడిని కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. కిడ్నాప్ కి గురైన వ్యక్తి గంపలగూడెం మండలం వినగడపకు చెందిన దిలీప్‌గా గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన దిలీప్ అందులో లక్షలు పోగొట్టుకున్నాడు. చివరకు అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో వాటిని తీర్చేందుకు ఈజీ మనీ కోసం ఇబ్రహీంపట్నం ప్రాంతానికి యువకులకు ఉద్యోగాల పేరుతో ఎరవేశాడు. తనకు తెలిసిన వారు ప్రభుత్వంలో ఉన్నారని, డబ్బుల చెల్లిస్తే గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని నమ్మించాడు.

ఈ విధంగా పలువురి నుంచి రూ.45 లక్షల వరకూ వసూలు చేసినట్లు సమాచారం. డబ్బులు తీసుకున్నాక ఉద్యోగాలు ఇప్పించకుండా దిలీప్ తప్పించుకు తిరుగుతుండడంతో డబ్బులు తిరిగిచ్చేయమని యువకులు కోరినా దిలీప్ మొహం చాటేస్తున్నాడు. దీంతో దిలీప్‌ను కిడ్నాప్ చేసినట్లు వెల్లడించారు. ఇక ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version