Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. నేడు నాలుగో దశ యాత్రలో భాగంగా పెడనలో బహిరంగసభలో పవన్ పాల్గొననున్నారు. ఈ మేరకు అశేష జనవాహిని మధ్య పవన్ కళ్యాణ్ మచిలీపట్నం నుంచి పెడనకు తాజాగా చేరుకున్నారు. ఆద్యంతం పవన్ కు జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీగా పెడనకు చేరుకున్నారు. స్థానిక తోటమూల సెంటర్ లో బహిరంగ సభ జరగనుంది. కాగా రాబోయే ఎన్నికల్లో వైకాపా వ్యతిరేక ఓట్లను చీలనివ్వబోమని తేల్చి చెప్పిన పవన్.. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు.
ఈ క్రమంలోనే పవన్ వారాహి యాత్రకు తెదేపా నేతలు కూడా భారీ స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. కాగా ఇప్పటికే కృష్ణా జిల్లా పోలీసులు పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పెడన వారాహి యాత్ర సభలో తనపై రాళ్లదాడి జరుగుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెడనలో వారాహి యాత్రలో వైసీపీ నేతలు రాళ్ల దాడికి ప్లాన్ చేస్తారని తనకు సమాచారం అందింది అంటూ మంగళవారం పవన్ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేశారు. పవన్ చేసిన ఈ ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే చూపించాలి అంటూ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.