Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. పల్నాడు జిల్లా ధూళిపాళ్ళ గ్రామంలో జరిగిన ఈ సభలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.
ఆ మేరకు పవన్ మాట్లాడుతూ… పోరాటం చేయనిదే మార్పు రాదని, ఈ విషయాన్ని జనసేన నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. అధికార పీఠంలో కూర్చోవాలని ఉవ్విళ్లూరు ప్రతి జనసేన నాయకుడు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. కేసులు పెడతారని భయపడొద్దని, ధైర్యంగా నిలబడాలన్నారు. నేను చెబుతున్నాను కదా… నా మీద లాఠీ పడితే రక్తం చిందించడానికైనా సిద్ధంగా ఉన్నాను. జైల్లో కూర్చోవడానికి కూడా వెనుకాడను. నా సినిమాలు ఆపేస్తావా… ఆపేసుకో. నన్ను ఏమీ చేయలేవు. నువ్వు కొట్టే కొద్దీ పైకి లేస్తాను తప్ప కిందపడేదిలేదు అని స్పష్టం చేశారు.
తాను ఎక్కడికి పారిపోనని… మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎప్పుడు అందుబాటులో ఉంటానని అన్నారు. తప్పు చేస్తే నా చొక్కా పట్టుకొని అడగండి…నేను మాటిస్తున్న అని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికలు హోరాహోరీగా ఉంటాయి, నిన్న చూశారు కదా ఎలా పార్టీ కార్యాలయాలు తగలబెట్టేశారో అని పవన్ వ్యాఖ్యానించారు. అధికారం పోతుంది కదా అని వైసీపీ వాళ్లు వచ్చే ఎన్నికల్లో గొడవలకు దిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న విషయం తనకు వదిలిపెట్టేయాలని తెలిపారు. జనసేనను అధికారంలోకి తెచ్చే బాధ్యతను నాకు వదిలేయండి… ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు సంబంధించిన ఎన్నికలకు ఎలాంటి వ్యూహంతో వెళ్లాలో నేను చూసుకుంటాను అని వెల్లడించారు.