Nara Chandrababu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. చంద్రబాబు నాయుడిని ఆదివారం రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే జైలులో ఆయనకు ప్రత్యేక వసతులు కల్పించేందుకు కోర్ట్ అనుమతించింది.
ఈ క్రమంలోనే చంద్రబాబు కోసం సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి భోజనం వచ్చింది. చంద్రబాబుకు మధ్యాహ్నం భోజనంగా 100 గ్రాముల బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీర్ కూర, పెరుగు పంపారు కుటుంబ సభ్యులు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు టీ తాగేందుకు వేడినీళ్లు అందజేశారు. అయితే ముందుగా సెంట్రల్ జైలులో భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణిలు.. చంద్రబాబును కలుస్తారని అంతా భావించారు.
అయితే మధ్యాహ్నం 3 గంటలకు వారు చంద్రబాబు నాయుడును కలుస్తారని అనుకున్న తరుణంలో భేటీ రద్దయ్యింది. దీనికి బదులుగా రేపు ఆయన ఫ్యామిలీని కలవనున్నారు. మరోవైపు అందుబాటులో వున్న నేతలతో నారా లోకేష్ భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్, తర్వాత జరిగిన పరిణామాలపై ఆయన చర్చిస్తున్నారు. ఇకపోతే.. చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. హౌస్ అరెస్ట్ పిటిషన్ తర్వాత మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.