GIS 2023: ఆంధ్రప్రదేశ్ దేశ ప్రగతిలో ఎంతో కీలకంగా మారిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఏపీలో పుష్కలంగా నీటి వనరులు ఉన్నాయని తెలిపారు. దాదాపు రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్రం వేదిక కానుందని వెల్లడించారు. విశాఖ పట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రాష్ట్రాభివృద్ధిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు (GIS 2023)
విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సమ్మిట్‌లో భాగంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. పర్యావరణ హితం.. పారిశ్రామిక రవాణా మౌలిక వసతులు, సాంకేతికత, వ్యవస్థాపకత ఈ నాలుగు రాష్ట్రానికి మూల స్తంభాల్లాంటివని అభివర‍్ణించారు. వివిధ ప్రతిపాదనలతో ప్రతినిధులు ముందుకు రావడం ఏపీకి గర్వకారణమని జగన్ అన్నారు.. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 రంగాల్లో దాదాపు 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ సమ్మిట్ తొలి రోజులో భాగంగా.. రూ.11.85 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు జరిగాయని జగన్ పేర్కొన్నారు. మిగతా ఎంఓయూలను రెండో రోజు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్ర యువతకు ఉద్యోగాలు లభిస్తాయని జగన్ తన ప్రసంగంలో తెలిపారు. రిలయాన్స్ గ్రూపు, ఆదానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, రెన్యూ పవర్, అరబిందో గ్రూప్ వంటి పలు కంపెనీలు ఏపీలో తమ వ్యాపారాన్ని విస్తరించనున్నాయి.
విశాఖ -బలమైన ఆర్ధిక కేంద్రం..
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ యూనిట్లు, పోర్ట్ ఆధారిత మౌలిక సదుపాయాలు, మెడ్‌టెక్ జోన్ టూరిస్ట్ హాట్‌స్పాట్‌లతో విశాఖ అత్యంత బలమైన ఆర్థిక కేంద్రంగా ఆవిర్భవించిందని జగన్ రెడ్డి తెలిపారు. ఈవెంట్ ను విశాఖలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విశాఖ కేవలం పారిశ్రామిక రంగంలో బలమైన నగరమే కాకుండా ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఈ సదస్సును నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భారత్‌ను వృద్ధిపథంలో నడిపే అగ్రగామి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని.. సమృద్ధిగా ఉన్న సహజ వనరులు, ఖనిజ సంపదఈ రాష్ట్ర సంపద అని జగన్ అన్నారు. సుమారు 974 కి.మీ తీరప్రాంతం మొదలైన వాటితో సహా అనేక సహజమైన, ప్రకృతి సిద్ధమైన బలాలు ఈ రాష్ట్రానికి సానుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 6 విమానాశ్రయాలు.. ఇందులో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు రాష్ట్రానికి ఎంతో పేరు తెచ్చాయని కొనియాడారు.
దేశంలో అభివృద్ధి చెందుతున్న పదకొండు పారిశ్రామిక కారిడార్లలో మూడు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. వీటిలో 10 పారిశ్రామిక నోడ్స్‌ఉన్నాయి. అనేక ప్రముఖ విద్యాసంస్థలు, వ్యూహాత్మక ప్రాంతాలతో సానుకూలతలు, ల్యాండ్ బ్యాంక్, నైపుణ్యం కలిగిన యువత, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక – వ్యాపార పర్యావరణ వ్యవస్థ ఇక్కడ ఉంది. అంతేకాదు.. పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చేందుకు అవసరమైన విధానాల కార్యాచరణ ప్రణాళికలు సహా చురుకైన, సానుకూలత ఉన్న ప్రభుత్వం ఇక్కడ ఉందని తెలిపారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 11.43% జీఎస్‌డీపీ వృద్ధిరేటు సాధించింది, ఇది దేశంలోనే అత్యధికమని జగన్ అన్నారు. 2020–21 ఏడాదికి ఇచ్చిన ఎస్‌జీడీ ఇండియా ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం నంబర్ 3వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక భౌగోళిక లక్షణాలు
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక భౌగోళిక లక్షణాలు ఉన్నాయని జగన్ అన్నారు. పెద్ద తీర ప్రాంతాన్ని వినియోగించుకుని గ్రీన్ హైడ్రోజన్ వినియోగం, ఉత్పత్తి, ఎగుమతులకు రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. ఇండస్ట్రియల్ మరియు లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుతీరంలో ఒక గేట్‌వేగా చెప్పదలచుకున్నాను.974 కి.మీ. పొడవైన తీరప్రాంతం రాష్ట్రానికి ఉంది. సముద్ర రవాణా, సంబంధిత అంశాల్లో రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా నాలుగు పోర్టులను నిర్మిస్తున్నాం. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు మరియు కాకినాడల్లో కొత్త పోర్టులను నిర్మిస్తున్నాం. ఇప్పుడు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరు పోర్టులకు ఇవి అదనం. వీటికి సమీపంలో పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణకు అవకాశాలున్నాయి.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తొలిస్ధానం..
వేగవంతమైన ఎంటర్ర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ సాధించడానికి అనుకూలమైన వ్యాపార వాతావరణం అవసరమని నేను బలంగా నమ్ముతాను. పెట్టుబడి దారులకు చక్కటి వ్యాపార వాతావరణాన్ని కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దృష్టిపెట్టింది. ఈజ్ ఆఫ్ డూయినంగ్ బిజినెస్‌లో దేశంలోనే మొదటి స్థానంలో రాష్ట్రం ఉండడం దీనికి నిదర్శనం. గడచిన మూడు సంవత్సరాలుగా రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలోని ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో వాణిజ్య మరియు పారిశ్రామిక వేత్తల నుంచి స్వీకరించిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయించింది. రాష్ట్రం అత్యధికంగా 97.89శాతం సానుకూల ఫీడ్ బ్యాక్‌తో ప్రథమ స్థానంలో నిలిచింది.