Site icon Prime9

MP Raghu Rama Krishnam Raju: భారత్ జోడో యాత్రకు లేని ఆంక్షలు, అమరావతి రైతులకు ఎందుకు? ఎంపీ రఘురామకృష్ణంరాజు

MP Raghuramakrishnam Raju

MP Raghuramakrishnam Raju

Andhra Pradesh: లక్షలాది మందితో కలిసి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడోయాత్రకు లేని ఆంక్షలు, అమరావతి రైతుల పాదయాత్రకు ఎందుకని ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. 29 వేల మంది రైతు కుటుంబాలు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చి మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, సామూహికంగా దైవదర్శనానికి వెళ్లే అవకాశం కూడా లేదా? అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, అమరావతి రైతులకు రక్షణ కల్పించలేని పోలీసు వ్యవస్థ కూడా, ఓ వ్యవస్థేనా అంటూ ఆయన నిలదీశారు. అమరావతి రైతులకు రక్షణ కల్పించడానికి అవస్థ పడుతున్న న్యాయ వ్యవస్థ ఒకవైపు, అన్యాయం చేయాలని చూస్తున్న శాసన వ్యవస్థ మరొకవైపు ఉన్నాయని అన్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించి, న్యాయాన్ని సాధించుకుందామని అమరావతి రైతులకు భరోసానిచ్చారు. మంత్రులు నోటికొచ్చినట్లు బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విశాఖను రాజధానిగా ఎవరు అడ్డుకోలేరన్న మంత్రుల వ్యాఖ్యలు అర్థరహితమని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలు లేవని తెలిపారు. గతంలో ఇదే న్యాయమూర్తి, జస్టిస్ ఎన్ వి రమణ కంటెంట్ కేసును గతంలో జగన్మోహన్ రెడ్డి తరఫున వాదించానని చెప్పి, స్వీకరించలేదని గుర్తు చేశారు. ప్రస్తుత పిటీషన్ లోను జగన్మోహన్ రెడ్డి రెస్పాండెంట్ గా ఉన్నారని తెలిపారు. తనకు తెలిసిన న్యాయ సూత్రాల ప్రకారం, పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలు లేవన్న ఆయన, బెంచ్ మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

Exit mobile version