Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్ . గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ హెల్త్‌కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షకు పైగా ఉద్యోగులు ఉండటంతో వీరిని పూర్తి స్దాయిలో లో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్‌ఎస్) పరిధిలోకి తీసుకు రావడానికి రంగం సిద్దమయింది.
2019లో గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం 1 లక్షా 35వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి 1.21 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ అనంతరం రెగ్యులర్ చేసింది. అంతేకాదు ప్రొబేషన్ పీరియడ్‌లో విధులు నిర్వహిస్తూ మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థకు ప్రభుత్వం మరో కీలక బాధ్యతను అప్పగిస్తోంది. ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ బాధ్యత మొత్తం వారికే అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. రైతు పండించిన ధాన్యం కళ్లాల్లో ఉన్నప్పటి నుంచి ధాన్యం సేకరణ, తరలింపు నుంచి మిల్లర్ వద్దకు ధాన్యం చేర్చి రశీదు తీసుకునే వరకు గ్రామ వాలంటీర్లకే బాద్యత ఇస్తారు. సేకరించిన ధాన్యాన్ని తరలించే వాహనానికి రూట్ ఆఫీసర్లుగా కూడా వాలంటీర్లే వ్యవహరిస్తారు. ధాన్యం సేకరణ చేపట్టే వాలంటీర్లకు ప్రభుత్వం నెలకు రూ.1500 పారితోషికంగా ఇవ్వాలని నిర్ణయించింది.