Indrakeeladri: ప్రముఖ శక్తి దేవాలయంగా కీర్తింపబడుతున్న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రేపటినుండి దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. శరన్నవరాత్రుల్లో పది అవతారాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తొలి రోజున రాష్ట్ర గవర్నర్ హరిచందన్ అమ్మవారిని దర్శించుకోనున్నారు.
సోమవారం నాడు ఉదయం 9గంటల నుండి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ప్రతి రోజు తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు అమ్మవారి దర్శనభాగ్యాన్ని పొందేలా దేవదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అంతరాలయ దర్శనాన్ని శరన్నరాత్రుల సందర్భంగా రద్దు చేశారు. భక్తుల రద్దీ నేపధ్యంలో భోజన ప్యాకెట్లు ప్రసాదంగా అందించనున్నారు. నదీ స్నానం స్ధానంలో షవర్లు ఏర్పాటు చేసారు. భక్తులకు అందించే ప్రసాదాల్లో ఒకటైన లడ్డులను 21 లక్షలు తయాచేసి పంపిణీకి సిద్ధం చేశారు. సీఎం జగన్మోహన రెడ్డి మూలా నక్షత్రం రోజున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. విద్యుత్ కాంతుల నడుమ ఆలయం శోభను గుప్పిస్తూ భక్తులను విశేషంగా ఆకట్టుకొంటుంది.
మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా దసరా ఉత్సవాలను ఘనంగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో తెలుగు, తమిళుల ఆరాధ్య దేవతగా కొలువబడుతున్న శ్రీ చెంగాళమ్మ ఆలయంలో కూడా శరన్నవ రాత్రుల వేడుకలను ఘనంగా చేపట్టేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. దసరా సారె ఉత్సవాన్ని ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. 10 రోజుల పాటు వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఊరేగింపుగా అమ్మణ్ణికి సారెను తీసుకొచ్చి సమర్పించుకొంటారు.