AP Journalists : ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నట్లు జగన్ సర్కార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అర్హతలకు సంబంధించి మార్గదర్శకాలు వెలువరించింది. అందులో భాగంగా ఏపీలో ప్రతీ జర్నలిస్టుకు మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. అలానే 60:40 శాతం చెల్లింపు పద్దతిలో ఇళ్ల స్థల కేటాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
జిల్లా ఇంచార్జ్ మంత్రి నేతృత్వంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు కమిటీలు ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే ఆ కమిటీలో జర్నలిస్టులకు (AP Journalists) సభ్యులుగా అవకాశం కల్పించనుంది. ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్‌ను రూపొందించి.. 45 రోజుల్లోగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జర్నలిస్టుల సొంతింటి కలను సీఎం @ysjagan నిజం చేస్తున్నారు. అర్హులైన వారికి 3 సెంట్ల స్థలం ఇవ్వనున్నారు. నవంబర్ 3న జరిగిన రాష్ట్ర మంత్రి మండలి ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపగా తాజాగా దరఖాస్తుల స్వీకరణకు ఉత్తర్వులు వెలువడ్డాయి. #CMYSJagan#AndhraPradesh pic.twitter.com/hWVc6m5blh
— YSR Congress Party (@YSRCParty) November 11, 2023
అర్హతగల గుర్తింపు పొందిన జర్నలిస్టుల జాబితాను సంబంధిత జిల్లా కలెక్టర్‌లకు అందజేయాలి. అటువంటి అభ్యర్థనలను స్వీకరించిన తర్వాత, జిల్లా స్థాయి కమిటీలు అటువంటి జర్నలిస్టులకు కేటాయింపు కోసం ఇంటి స్థలాలకు సరిపోయే భూమిని గుర్తిస్తాయి. జర్నలిస్ట్ పనిచేస్తున్న / నివసిస్తున్న జిల్లాలోనే ఇంటి స్థలాలను కేటాయించవచ్చు. జర్నలిస్ట్ పనిచేస్తున్న / నివసిస్తున్న మండలంలో కేటాయింపులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
నిబంధనలు ఏంటంటే..
- ప్రస్తుతం గుర్తింపు పొందిన, మీడియాలో కనీసం 5 ఏళ్ల అనుభవం ఉన్న జర్నలిస్టులు మాత్రమే ఇంటి స్థలాలకు అర్హులు.
- జర్నలిస్టులు ఇప్పటికే తమ పేరు మీద లేదా వారి జీవిత భాగస్వామి పేరు మీద, వారు పనిచేస్తున్న / నివసిస్తున్న స్థలంలో ఇంటి స్థలం / ఫ్లాట్ / ఇల్లు ఉన్నట్లయితే, ఇంటి స్థలం మంజూరు కోసం పరిగణించబడదు.
- ప్రభుత్వ శాఖలు, PSUS, కార్పొరేషన్‌లలో అక్రిడిటేషన్ కార్డ్‌లను కలిగి ఉన్న ఏ సాధారణ ఉద్యోగి జర్నలిస్ట్‌ల హౌసింగ్ స్కీమ్” కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.
- కేటాయించిన ఇంటి స్థలంలో కేటాయించిన వ్యక్తి సైట్‌ను అప్పగించిన తేదీ నుండి పదేళ్ల వ్యవధిలో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలి.
- ఒకవేళ ఆ లోపు నిర్మాణాన్ని పూర్తి చేయకపోతే కేటాయింపు రద్దు చేస్తారు.
- ఆయా నిబంధనల మేరకు అర్హులైన జర్నలిస్టులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచిస్తోంది.