Gannavaram TDP Office: గన్నవరంలో టీడీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ దాడి ఘటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గన్నవరంలో 144 సెక్షన్ విధించినట్టు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
సోమవారం జరిగిన సంఘటనల నేపథ్యంలో టీడీపీ ‘ ‘ఛలో గన్నవరం’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని ఆయన చెప్పారు.
గన్నవరం టీడీపీ ఆఫీస్ వద్ద జరిగిన ఘటనలో అక్కడే డ్యూటీలో ఉన్న గన్నవరం సీఐ తలకు గాయమైందని ఎస్పీ తెలిపారు. టీడీపీ నేత పట్టాభి రామ్ రెచ్చగోట్టె వ్యాఖ్యల వల్లే శాంతి భద్రతలకు విఘాతం కలిగిందన్నారు ఎస్పీ పేర్కొన్నారు.
టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగిన దృశ్యాలను పరిశీలిస్తున్నామన్న ఆయన సుమోటో గా కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా సభలు, నిరసనలు, కార్యక్రమాలు చేపట్ట వద్దని ఆయన తెలిపారు.
నా భర్త ఎక్కడున్నారో చెప్పాలి: పట్టాభి భార్య(Gannavaram TDP Office)
మరోవైపు టీడీపీ నేత పట్టాభి రామ్ కనిపించడం లేదని ఆయన భార్య చందన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎలాంటి సమాచారం లేకుండా పట్టాభిని ఎవరో తీసుకెళ్లారని .. ఇప్పటి వరకు ఆయన ఎక్కడున్నారో తెలియని ఆమె అన్నారు.
తన భర్త ఎక్కడున్నారో చెప్పని పక్షంలో డీజీపీ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తానని చందన స్పష్టం చేశారు. రాత్రి నుంచి నాన్న ఇంటికి రాలేదని తన కూతురు భయపడుతున్నట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల తరపున మాట్లాడితే కేసులు పెడతారా అని ఆమె ప్రశ్నించారు. ప్రతి పోలీస్ స్టేషన్ కు తమ వాళ్లని పంపామని, కానీ ఎక్కడా తన భర్త ఆచూకీ లేదని తెలిపారు.
పట్టాభిని ఎక్కడ దాచారని ఆమె ప్రశ్నించారు.
వంశీ అనుచరుల వీరంగం
కాగా, గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అనుచరులు వీరంగం సృష్టించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై సోమవారం రాత్రి వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు.
కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఆఫీస్ ఆవరణలో ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు.
కత్తులతో టీడీపీ ఫ్లెక్సీలనువైఎస్సార్సీపీ కార్యకర్తలు చించివేశారు. ఓ కారు అద్దాలను ఇటుకలతో బద్దలు కొట్టారు. పార్టీ కార్యాలయంలో కలియతిరుగుతూ విధ్యంసం సృష్టించారు.
పట్టించుకోని పోలీసులు
ఈ దాడి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులే చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పోలీసులు ఉండగానే చూస్తుండగానే వైఎస్సార్సీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు.
ఈ విషయంపై పోలీసులను అడిగితే సమాధానం చెప్పేందుకు నిరాకరించడం విశేషం.
టీడీపీ నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే అంత నష్టం జరిగేది కాదని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. పోలీసులు అలసత్వమే కారణమని టీడీపీ ఆరోపిస్తోంది.
విమర్శల నేపథ్యంలో
కాగా, రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ పై వల్లభనేని వంశీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు వంశీపై ఎదురుదాడికి దిగారు.
ఈ క్రమంలో వంశీ అభిమానులు టీడీపీ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం టీడీపీ కార్యకర్త ఇంటిపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించగా..
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగారు. తర్వాత టీడీపీ కార్యాలయంలో విధ్వంసానికి పాల్పడ్డారు.