Andhra Pradesh: రైతు మోటార్లకు మీటర్లు బిగిస్తే బిగించేవాడి చేతులు నరకుతామంటూ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో రైతు సదస్సులో పాల్గొన్న ఆయన రాజన్న పాలన తెస్తానని రాజన్న మాటకి సీఎం జగన్ పంగ నామాలు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణలో రైతు వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగిస్తే పగలగొడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని ఆయన గుర్తు చేసారు.
అయితే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి. నిజాం నవాబు వచ్చినట్టు మంది మార్బలంతో సామాన్య ప్రజానికాన్ని ఇంటి నుంచి బయటకు రాకుండా భయభ్రాంతులకు గురిచేసి తిరుపతికి వస్తారా అంటూ నారాయణ ప్రశ్నించారు. కొద్ది రోజులకిందట ప్రారంభయిన అమరావతి రైతుల పాదయాత్రకు నారాయణ తన మద్దతు తెలిపారు.
పాదయాత్ర, ర్యాలీలు అంటే జగన్‌కి ఎందుకంత కోపమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైఎస్ జగన్ దిగిపోవాలని పాదయాత్ర చేయడం లేదని, అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే రైతులు పాదయాత్ర చేస్తున్నారని చురకలు అంటించారు. జగన్, వైఎస్సార్ కూడా పాదయాత్రలు చేసే ముఖ్యమంత్రులు అయ్యారంటూ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే కొనసాగితే రానున్న రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతమయ్యే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు.