Site icon Prime9

CM Ys Jagan : వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన సీఎం జగన్.. చంద్రబాబుపై కక్ష్య లేదంటూ !

CM Ys Jagan shocking comments at ysrcp meeting in vijayawada

CM Ys Jagan shocking comments at ysrcp meeting in vijayawada

CM Ys Jagan : విజయవాడ ఇందిరా గాంధీ మున్సి­పల్‌ స్టేడియంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు,  జెడ్పీ చైర్మన్, రీజినల్ కో ఆర్డినేటర్లు, సోషల్ మీడియా  కో ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం,మండల స్థాయి ముఖ్య నాయకులతో కలిసి 8,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. గడిచిన నాలుగేళ్ల పాలనలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 99 శాతం హామీలను నెరవేర్చాం అని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని.. ఫిబ్రవరిలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని.. మార్చిలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుదామని వైసీపీ నేతలకు జగన్ (CM Ys Jagan) పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీవినీ ఎరగని అభివృద్ధిని ఈ 52 నెలల పాలనలోనే చేసి చూపించామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదని జగనన్న సురక్ష పథకం తీసుకొచ్చామని తెలిపారు. ఈ పథకం కింద 15 వేల హెల్త్ క్యాంపులను నిర్వహిస్తూ, 1.65 కోట్ల ఇళ్లను కవర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మూడు ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా, ఓ బాధ్యతగా అధికారాన్ని చేపట్టామని జగన్ వివరించారు. ప్రజలకు తొలి సేవకుడిగా పాలన అందిస్తున్నాం కాబట్టే ఈ 52 నెలల కాలం చరిత్రలో నిలిచేలా మారిందని వివరించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ‘ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని వచ్చే నెల 1 నుంచి డిసెంబర్ 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని సీఎం జగన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

చంద్రబాబు అవినీతి గురించి తెలుసు కాబట్టే ఈడీ, సీబీఐ నోటీసులు ఇచ్చాయి. చంద్రబాబుపై కక్షపూరితంగా చేసి ఉంటే కేంద్రంలో బీజేపీ ఉంది. బీజేపీలో సగం మంది టీడీపీ వాళ్లే ఉన్నారు. వారు  స్పష్టమైన ఆధారాలు ఉన్నా చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దట. పచ్చ గజ దొంగలు చంద్రబాబు అరెస్ట్‌ను అన్యాయం అంటున్నాయి. బాబును సమర్థించడం అంటే పేదలను వ్యతిరేకించినట్టే. చంద్రబాబును సమర్థించడం అంటే పెత్తందారి వ్యవస్థను సమర్థించడమేనని.. రెండు సున్నాలు కలిసినా.. నాలుగు సున్నాలు కలిసినా.. ఫలితం సున్నానే అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, దత్తపుత్రుడు ఇంకెవరు కలిసి వచ్చినా సున్నానే. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వాళ్లకు లేదు. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే వారి లక్ష్యం. రాజకీయం అంటే చనిపోయాక కూడా బతికుండటం. మంచి జరిగితేనే అండగా ఉండాలని కోరుతున్నా. మన ధైర్యమంతా చేసిన మంచే. అందుకే వై నాట్‌ 175 అని ప్రజల్లోకి వెళ్తున్నామని స్పష్టం చేశారు.

జనవరి 1 నుంచి పెన్షన్ ను పెంచుతున్నామని.. ఇచ్చిన మాట ప్రకారం రూ. 3 వేల పెన్షన్ ఇస్తామని చెప్పారు. పెంచిన పెన్షన్ అవ్వాతాతలు, వితంతువులకు వర్తిస్తుందని తెలిపారు. జనవరి 10 నుంచి జనవరి 20 వరకు వైఎస్సార్ చేయూత ఉంటుందని.. ఈ పథకం ద్వారా రూ. 19 వేల కోట్లను అందిస్తున్నామని చెప్పారు. జనవరి 20 నుంచి 30 దాకా వైఎస్సార్ ఆసరా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమాన్ని అందించామని చెప్పారు. ప్రజలతోనే వైసీపీ పొత్తు అని.. గ్రామ స్థాయి నుంచి వైసీపీ శ్రేణులు మమేకం కావాలని పిలుపునిచ్చారు. తాను దేవుడిని, ప్రజలనే నమ్ముకున్నానని.. పొత్తులపై ఆధారపడనని చెప్పారు.

Exit mobile version