Site icon Prime9

Vizianagaram Train Accident : విజయనగరం జిల్లా ప్రమాదంపై స్పందించిన సీఎం జగన్, పీఎం మోదీ, ప్రముఖులు.. నష్ట పరిహారం ప్రకటన

cm jagan, pm modi, pawan kalyan and other leaders respond on Vizianagaram Train Accident

cm jagan, pm modi, pawan kalyan and other leaders respond on Vizianagaram Train Accident

Vizianagaram Train Accident : విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై పలువురు ప్రముఖులు స్పందించారు. ముందుగా ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన ఏపీ వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. అదే విధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన మృతులకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎస్పీ దీపికా, స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత రైలు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు రైలు ప్రమాద ప్రాంతానికి ముఖ్యమంత్రి జగన్ వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రమాద స్థలానికి బయలుదేరి బాధితులను పరామర్శించనున్నారు. ఇప్పటికే అధికారులు సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయగా మంత్రి గుడివాడ అమర్నాథ్, అధికారులు కూడా వెళ్లనున్నారు.

 

నష్టపరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ..

ఏపీలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం అలమండ- కంటకాపల్లి వద్ద రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ కనీసం ఏడుగురు చనిపోగా, మరో 50 మంది వరకు గాయపడ్డారని సమాచారం. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల మేర నష్టపరిహారం ప్రధాని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి సైతం రూ.50 వేలు చికిత్స కోసం అందజేయనున్నట్లు తెలిపారు. రైలు ప్రమాదం గురించి తెలియగానే ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే మంత్రి  మాట్లాడారు. ప్రమాదం వివరాలపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఫోన్ కాల్ చేసి ఆరా తీశారని పీఎంఓ తెలిపింది. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. బాధితులకు సాధ్యమైనంత మేరకు సహాయ సహకారాలు అధికారులు అందిస్తున్నారని చెప్పారు.

 

 జనసైనికులు సహాయక చర్యల్లో పాల్గొనాలన్న జనసేనాని.. 

విజయనగరం జిల్లా రైలు ప్రమాదం తనను కలచివేసిందని పవన్ కళ్యాణ్ వాపోయారు. విశాఖ -పలాస, రాయగడ్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే వైద్యం అందించాలని, రైల్వే అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతి తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఒడిశా రైలు ప్రమాదం ఘటనను మరువకముందే మరో రైలు ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు. పార్టీ శ్రేణులు, జనసైనికులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ పిలుపునిచ్చారు.

 

ప్రమాదంపై విచారం వ్యక్తో చేసిన నారా లోకేష్, పురంధేశ్వరి..   

రైలు ప్రమాదంపై నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన వారికి ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. సమీపంలో తెలుగుదేశం పార్టీ కేడర్ తక్షణమే ప్రమాద స్థలానికి వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం పై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Exit mobile version