Kuppam: ఏపీ సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోటలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి సారి జగన్ కుప్పంకు రానున్నారు. సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసారు. వచ్చే ఎన్నికల పైన ఇప్పటికే ఫోకస్ చేసిన సీఎం జగన్ 175 సీట్లలో విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. పార్టీ నేతలు ఇదే విధంగా దిశా నిర్దేశం చేస్తున్నారు. అందులో కుప్పంలో ఎందుకు గెలవలేమంటూ సీఎం పదే పదే ప్రశ్నిస్తున్నారు. కుప్పం నుంచే తొలి అడుగు స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో అనూహ్యంగా వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది.
వచ్చే ఎన్నికలకు సంబంధించి కుప్పం అభ్యర్ధిగా ఎమ్మెల్సీ భరత్ ను సీఎం ఖరారు చేసారు. భరత్ ను గెలిపిస్తే వచ్చే ప్రభుత్వంలో మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. సీఎంగా ఇదే నియోజకవర్గం నుంచి చంద్రబాబు 14 ఏళ్లు పని చేసినా కుప్పం రెవిన్యూ డివిజన్ చేయలేకపోయారంటూ పలు సందర్భాల్లో సీఎం ఎద్దేవా చేసారు. కుప్పంను రెవిన్యూ డివిజన్ చేయాలంటూ తనకు చంద్రబాబు లేఖ రాసారని చెప్పుకొచ్చారు. తాజాగా జరిగిన జిల్లాల పునర్విభజన, కొత్త రెవిన్యూ డివిజన్లలో భాగంగా కుప్పంను రెవిన్యూ డివిజన్ గా ఖరారు చేసారు.
పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. అక్కడే చేయూత లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నారు. ప్రత్యేక విమానంలో 10.05 గంటలకు ముఖ్యమంత్రి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి 10.15 గంటలకు హెలికాప్టర్‌లో కుప్పం వెళతారు. తిరిగి తిరుపతి విమానాశ్రయం చేరుకుని, 1.55 గంటలకు విజయవాడ వెళ్తారు. కుప్పం పర్యటన సందర్భంగా సీఎం జగన్ కుప్పంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా మూడో విడత వైఎస్ఆర్ చేయూత పథకం నిధులను జగన్ విడుదల చేస్తారు. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే సీఎం జగన్ సభకు రాకపోతే ఐదవందల రూపాయలు ఫైన్ అంటూ దండోరా వేయించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కంభంపల్లిలో చోటు చేసుకుంది. సీఎం జగన్ కుప్పం వస్తుండటంతో చంద్రబాబు ఇలాకలో భారీగా జనసమీకరణ చేసేందుకు వైసీపీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కంభంపల్లిలో వైసీపీ దండోరా వేయించిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. సీఎం జగన్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.