Chandrababu Naidu: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో శాసనమండలి రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసి.. ఇపుడు స్ధానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉందా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
తన మాట గెలవలేదనే అహంకారంతో ఆ రోజు జగన్ ఏకపక్షంగా మండలి రద్దుకు తీర్మానం చేయలేదా అని చంద్రబాబు నిలదీశారు.
మండలి వ్యవస్థను అగౌరవ పరిచిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టి ఓట్లు అడుగుతారని
మండిపడ్డారు.
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలపై పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను టీడీపీకి అనుకూలంగా మార్చుకోవాలని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
పాలనలో అన్ని విధాలుగా విఫలమైన జగన్ తీవ్ర అసహనంతో ఉన్నారని, అందులో భాగంగానే రాష్ట్రంలో తెదేపా నేతల పర్యటనలు,
సభలపై ఆంక్షలు పెడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపిస్తుండటంతో.. దాడులు, హింసాత్మక ఘటనలతో భయపెట్టాలనే ప్రయత్నాలు మొదలు పెట్టారని దుయ్యబట్టారు.
కరుడుగట్టిన ఉగ్రవాదిలా జగన్ ప్రవర్తిస్తుంటే.. కొందరు పోలీసులు బాధ్యత మరిచి ఆయనకు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు.