Bank Notice To Mla Sridhar Reddy: ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆస్తులు వేలానికి సిద్ధమయ్యాయి. ఎమ్మెల్యే ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన జారీచేసింది. మెసర్స్ ఏఎస్‌ఆర్ ఇంజినీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (మెసర్స్ సాయిసుధీర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) కంపెనీకి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి భార్య అపర్ణరెడ్డి, ఆయన తండ్రి వెంకటరామిరెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. కాగా ఈ కంపెనీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి షూరిటీగా రుణాలు తీసుకుంది. ఆ లోన్ డబ్బును సకాలంలో చెల్లించకపోవడం నోటీసులకు స్పందించకపోవడంతో ఆగస్టు 18న కంపెనీ ఆస్తులతో కలిపి ఎమ్మెల్యే ఆస్తులను వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంకు తెలిపింది.
అప్పు ఎంతంటే(Bank Notice To Mla Sridhar Reddy)
ఈ కంపెనీ పేరుతో తీసుకున్న లోన్లు ఏప్రిల్ 30 నాటికి వడ్డీతో కలిపి దాదాపు రూ.908 కోట్లు అయ్యింది. అందుకే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆస్తులను వేలం వేయనున్నట్లు బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆస్తులన్నీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. 2005 డిసెంబరులో ఏఎస్‌ఆర్ ఇంజినీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీ ప్రారంభించినట్లు సమాచారం. మొదట్లో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, ఆయన తండ్రి వెంకటరామిరెడ్డి ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారట. తర్వాత శ్రీధర్‌రెడ్డి రాజీనామా చేయగా.. 2014లో ఆయన భార్య అపర్ణరెడ్డి డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టారు. తమ కంపెనీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో చేపట్టిన పనులను పూర్తి చేసిందని.. కానీ ఆ పనులకు సంబంధించి బిల్లులు మంజూరు కాకపోవడంతో సకాలంలో వడ్డీలు చెల్లించలేదని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అంటున్నారు. ఆయన ఏపీ, తెలంగాణ, కర్ణాటకతోపాటు ఆఫ్రికాలోని ఉగాండాలోనూ కాంట్రాక్టులు, వ్యాపారాలు చేస్తున్నారు.
శ్రీధర్ రెడ్డిది ఉమ్మడి అనంతపురం జిల్లా నల్లమాడ మండలం నల్లసింగయ్యగారి పల్లి. శ్రీధర్ రెడ్డి తొలుత కస్టమ్స్ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ఉద్యోగం మానేసి కాంట్రాక్టులు, వ్యాపారాలు మొదలుపెట్టారు. అనంతరం వైసీపీలో చేరి.. 2014లో హిందూపురం ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో పుట్టపర్తి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.