Site icon Prime9

పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండేదని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు… స్వార్థం కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలపై ఆధారపడొద్దు

brother-anil-kumar-sensational-comments-on-ap-government

brother-anil-kumar-sensational-comments-on-ap-government

Bro. Anil Kumar : ఏపీ సీఎం జగన్ బావ, బ్రదర్ అనిల్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండునని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని అనిల్ చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విశాఖ జిల్లా భీమిలి మండలంలో క్రైస్ట్ కేర్ అండ్ క్యూర్ మినిస్ట్రీస్ లో నిర్వహించిన ప్రార్ధన కూడికలో పాల్గొన్న బ్రదర్ అనిల్… ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవుడి పథకాలు వేరేగా ఉంటాయని తమ స్వార్ధం కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలపై ప్రజలు ఆధారపడొద్దని అనిల్ కుమార్ చెప్పారు. ఏపీలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడినప్పటికీ… తన బావ సీఎం జగన్ పేరు గానీ, వైఎస్సార్ సీపీ గురించి కానీ ప్రస్తావించకపోవడం గమనార్హం. ప్రస్తుతం అనిల్ కుమార్ చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

ప్రార్ధన కూడికలో అనిల్ కుమార్ మాట్లాడుతూ… ఒకరి అవిధేయత వల్ల అందరికీ సెగ … మీరు పాపులా, నీతిమంతుల ?…  నోరు మారితే జీవితం మారుతుంది… డాక్టర్ నోరు తెరిచి చూపించమంటాడు, అది రోగమా , మాయ రోగమా తెలిసిపోతుంది. ఇక్కడ దొంగ బాబాలు ఎక్కువ, అన్ని డ్రామాలు ఎందుకు… నీ కొరకు , నా కొరకు ప్రాణం పెట్టాడు అది ప్రేమంటే.. నీతిని సంపాదించేంత బలం ఏ ఒక్కరికి లేదు… పాపి పాపి అని నా నోరు తీరగడం లేదు… 40 సంవత్సరాల తర్వాత అడవిలో పారేస్తే గొర్రెలు కాచుకునే వాడు అంటూ దైవ వాక్యంలోనే పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే జగన్ తో సోదరి షర్మిల విభేదించి తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆస్తుల పంపకాల్లో విభేధాల కారణంగానే జగన్ – షర్మిల మధ్య విభేదాలు వచ్చాయని అంతా భావిస్తున్నారు. ఇందుకు మరింత బలాన్ని ఇస్తూ వ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో షర్మిల కూడా జగన్ పై ఘాటుగా స్పందించారు. అలానే ఇటీవల హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించినప్పుడు కూడా జగన్ నిర్ణయం సరైనది కాదని షర్మిల చెప్పిన విషయం తెలిసిందే. ఇక వైఎస్ విజయమ్మ సైతం వైసీపీ ప్లీనరీ వేదికగా పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవిలో కొనసాగలేనని… కుమార్తె షర్మిలకు మద్దతుగా ఉంటానని చెప్పారు. సీఎం జగన్ – షర్మిల తమ తండ్రి వైఎస్సార్ జయంతి, వర్దంతి సమయాల్లోనే ఇడుపులపాయలో ఒకే వేదిక మీదకు వచ్చిన వారి మధ్య పెద్దగా మాటలు ఉండడం లేదని సమాచారం.

కాగా గతంలో కూడా బ్రదర్ అనిల్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలతో సమావేశమైన అనిల్ కొత్త పార్టీ దిశగా కూడా చర్చలు చేసారు. వారంతా ఎన్నికలకు ముందు వైసీపీకి మద్దతుగా నిలిచారని, ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటు దిశాగా ఆలోచన చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వారు పార్టీ ఏర్పాటు చేస్తే తాను మద్దతు ఇస్తానని అప్పట్లోనే బ్రదర్ అనిల్ స్పష్టం చేసారు. తరువాత బ్రదర్ అనిల్ పార్టీ ఏర్పాటు ఖాయమని ప్రచారం సాగింది. కానీ, అనిల్ తాను పార్టీ ఏర్పాటు చేయటం లేదని స్పష్టత ఇచ్చారు. ఆ తరువాత రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లితో కూడా సమావేశమయ్యారు. ఆ భేటీ తరువాత రాజకీయ పరిస్థితుల పైన చర్చించామని చెప్పారు. అన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయంటూ ఆసక్తి పెంచారు.

అదే విధంగా షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు పైన సీఎం జగన్ విభేదించారు. పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం తమ విధానం కాదని సీఎం జగన్ స్పష్టతతో ఉన్నారని వైసీపీ ముఖ్య నేత సజ్జల స్పష్టం చేసారు. ఇక ఇటీవల షర్మిలను తెలంగాణలో అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా ఆమె గురించి మాట్లాడకపోవడం, కలవకపోవడం వారి విభేదాలను స్పష్టం చేస్తుంది. ఇప్పుడు బ్రదర్ అనిల్ కూడా చేస్తున్న వ్యాఖ్యలు ఏపీలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

Exit mobile version