Site icon Prime9

Bike Ambulance: గిరిజనుల కోసం బైక్ అంబులెన్స్ లు.. ఏపీ సర్కార్ కొత్త ప్రాజెక్టు

Bike ambulance

Bike ambulance

Andhra Pradesh: మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకుఅనారోగ్యం వస్తే డోలీ కట్టి, మంచాలపై పడుకోబెట్టి కొండల్లో, గుట్టల్లో అటవీ ప్రాంతం గుండా తీసుకువెళ్తుంటారు. ఇటువంటి వారందరికీ తక్షణ వైద్యసహాయం అందించేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరి రక్షక్ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీనికింద బైక్ అంబులెన్సులను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో 104, 108 అంబులెన్సులతో పాటు మూడు చక్రాల 122 ఫీడర్ అంబులెన్సులతో సేవలు అందిస్తోంది. అయితే ఈ మూడు చక్రాల వాహనాలు కూడా వెళ్లలేని ప్రాంతాలకు వెళ్లేలాఈ బైక్ అంబులెన్స్ లను తీర్చిదిద్దారు.

నాలుగు చక్రాల అంబులెన్స్ లు వెళ్లాలంటే 6 ఫీట్ల గల రోడ్డు, కనీసం మట్టి రోడ్డు అయినా ఉండాల్సిందే. మూడు చక్రాలు గల ఫీడర్ అంబులెన్సులు వెళ్లాలన్నా కనీసం 3 ఫీట్ల రోడ్డు కావాల్సి వస్తుంది. అయితే చాలా గిరిజన ప్రాంతాలకు కేవలం అడుగు లేదా అడుగున్నర మార్గం ఉండే కాలిబాట మాత్రమే ఉంటుంది. బైక్ అంబులెన్సులు అడుగు, అడుగున్నర మార్గంలో కూడా వెళ్తాయి. మారుమూల ప్రాంతాల గిరిజనులకు ఉపయోగపడతాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణలో కాకినాడ జేఎన్టీయూ రూపొందించిన బైక్ అంబులెన్స్ మోడల్ తరహాలో కొత్త బైక్ అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ బైక్ అంబులెన్స్ లో రెండు సీట్లు ఉంటాయి. డ్రైవింగ్ సీటు వెనక ఒక వ్యక్తి సౌకర్యంగా కూర్చునేలా ఈ సీటు ఉంటుంది. 140 డిగ్రీల కోణంలో వాల్చిన తొట్టెలాంటి సీటు ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేలా అరకిలో ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది. అలాగే సెలైన్ బాటిన్ పెట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ సామాగ్రి ఉండేలా ఈ బైక్ అంబులెన్స్ ను డిజైన్ చేశారు.

ఈ బైక్ అంబులెన్స్ లను పర్యవేక్షించేలా ప్రత్యేక యాప్ ను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రతి బైక్ అంబులెన్స్ కు 15 మారుమూల గిరిజన ప్రాంతాల చొప్పున అప్పగించి, అక్కడి ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన, వారి సంక్షేమం, విద్య, పోషకాహారం వంటి అంశాలపై శ్రద్ధ వహిస్తారు. గర్భిణులను నెల రోజుల ముందుగానే బర్త్ వెయిటింగ్ రూములకు తరలిస్తారు. ఇందుకోసం రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 45 బర్త్ వెయిటింగ్ రూములకు అదనంగా 32 కొత్త వాటిని ఏర్పాటు చేసి మొత్తం 77 కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Exit mobile version