YSR Law Nestham: ఆంధ్రప్రదేశ్ లోని యువ న్యాయవాదులకు శుభవార్త. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన యువ లాయర్లకు అండగా ఉండే లక్ష్యంతో ‘వైఎస్ఆర్ లా నేస్తం’అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం. దీనిలో భాగంగా 2023-24 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ‘వైఎస్ఆర్ లా నేస్తం’ నిధులను నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నేడు ఆ డబ్బు జమ చేశారు సీఎం. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ప్రతి నెలకు రూ. 5 వేల చొప్పున అంటే ప్రతి వ్యక్తికి రూ. 25 వేల లెక్కన మొత్తం రూ. 6,12,65,000లను వారి ఖాతాల్లో జమ చేశారు.
కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన యువ లాయర్లకు అండగా ఉండేందుకు స్టైఫండ్ ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా వీరికి మూడేళ్ల పాటు ఏడాదికి రూ. 60 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. అంటే మూడేళ్ల కాలంలో ప్రతి ఒక్కరికి రూ. 1.80 లక్షలు ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 5,781 మంది యువ లాయర్లకు రూ. 41.52 కోట్లు చెల్లించింది.
ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకునే యువ న్యాయవాదులు ఆన్‌లైన్‌లో sec_law@ap. gov.in ద్వారా గానీ, నేరుగా లా సెక్రటరీకి గానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వైఎస్ఆర్ లా నేస్తం పథకానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే 1902 నెంబర్‌కు కాల్ చేసి ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఇక ఇంతేకాకుండా న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది.