AP CM Chandrababu Naidu visit Tirupathi with Family: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన మనవడు దేవాన్ష్.. జన్మదినం సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. అంతకుముందు మంత్రి లోకేశ్‌తో సహా కుటుంబసభ్యులంతా రాత్రి పద్మావతి గెస్ట్ హౌజ్‌కు చేరుకున్నారు. వీరికి టీడీడీ ఛైర్మన్, ఈఓ ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీటీడీ అధికారులతో తిరుమల అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు.
ఇదిలా ఉండగా, తిరుమలలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అలిపిరిలో ముంతాజ్, మరో హోటల్‌కు గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏడుకొండలను ఆనుకొని కమర్షియలైజేషన్ ఉండకూడదని చెప్పారు. శ్రీవారి ఆస్తులను కాపాడటమే లక్ష్యమని వెల్లడించారు. దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీవారి ఆలయం కట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. అన్ని రాష్ట్రాల సీఎంలు ముందుకు వస్తే నిర్మాణాలు చేపడుతామని చెప్పారు.
ఏడు కొండలు వేంకటేశ్వరుడి సొంతమని, ఈ ఏడు కొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదని చంద్రబాబు అన్నారు. తిరుమల తిరుపతి శ్రీవారి ఆస్తులను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే తిరుమలలో పరిశుభ్రతకు ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వనున్నామని, రాష్ట్ర పునర్నిర్మాణం ఇక్కడి నుంచే ప్రారంభించామని వెల్లడించారు.
కాగా, తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత రంగనాయకుల మండంపలో వేదపండితులతో ఆశీర్వచనాలు అందించారు. ఈ మేరకు వేదపండితులు చంద్రబాబుకు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. అనంతరం తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తరిగొండ వెంగమాంబ సత్రంలో అన్నదానం చేశారు. స్వయంగా చంద్రబాబుతోపాటు కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు. అనంతరం తిరుమల నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.