Andhra Pradesh: అనేక వాయిదాల అనంతరం నేడు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మంత్రి వేణుగోపాలకృష్ణ మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ భేటీలో మొత్తం 57 ఆంశాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
కేబినేట్ సమావేశంలోని కీలక నిర్ణయాలు ఇవే..
- రాష్ట్రంలో రూ.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర పడింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో రూ.81వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.
- 21వేల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు, దివ్యాంగులకు 4 శాతం ఉద్యోగాల కల్పనకు, పదోన్నతుల్లో రిజర్వేషన్లకు ఏపీ కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 195 మంది ఖైదీలను విడుదల చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
- వైఎస్సార్ చేయూత పథకానికి కేబినేట్ ఆమోద ముద్ర లభించింది. ఈనెల 22నుంచి సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేపట్టనున్నట్టు మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు
- సచివాలయంలో 85 అదనపు పోస్టుల భర్తీకి, ఒక్కో సచివాలయానికి రూ.20లక్షల నిధుల మంజురూకు, ఆర్ అండ్ బీలో ఆర్కిటెక్ విభాగంలో 8 పోస్టుల భర్తీకి మంత్రి వర్గం పచ్చ జెండా ఊపింది.
- భావనపాడు పోర్టు విస్తరణ పనులకు, విశాఖపట్నం పరిధిలోని లక్ష ఇళ్ల నిర్మాణానికి పరిపాలనా పరమైన ఆమోదం లభించింది.
- కురుంపా ట్రైబల్ ఇంజినీరింగ్ కళాశాలలో సిబ్బంది నియామకానికి, నంద్యాల జిల్లా పాణ్యంలో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు, ప్రతీ మండలంలో రెండు పీహెచ్‌సీల ఏర్పాటుకు ఆమోద ముద్ర పడింది.
- పైడిపాలెం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సహా నూతనంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం లభించిందని మంత్రి వెల్లడించారు.