Site icon Prime9

Anam Ramnarayana Reddy : తెదేపా గూటికి చేరనున్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి.. అఫిషియల్ !

anam ramnarayana reddy meeting with tdp leaders in nellore

anam ramnarayana reddy meeting with tdp leaders in nellore

Anam Ramnarayana Reddy : ఏపీలో రాజకీయాలు రోజుకో రంగు మారుతున్నాయి. మరీ ముఖ్యంగా  నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఆనం రాంనారాయణ రెడ్డి తెదేపా గూటికి చెరనున్నారు. ఈ మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా తెదేపా నేతలతో ఆయన ఇంట్లో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఇందుకు మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, జిల్లాలోని తెదేపా సీనియర్ నేతలు, తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నెల్లూరులో లోకేశ్‌ యువగళం పాదయాత్ర స్వాగత ఏర్పాట్లపై చర్చించినట్లు సమాచారం అందుతుంది.

తెదేపా నేతలతో భేటీ అనంతరం ఆనం (Anam Ramnarayana Reddy) మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నెల్లూరులో మొదలు కాబోతుంది. నిన్న పార్టీ అధినేత చంద్రబాబుతో మాట్లాడాను. నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్రను విజయవంతం చేస్తాం. లోకేశ్‌ పాదయాత్ర నిర్వహణపై ప్రణాళిక వేశాం. అందరం కలిసి పార్టీని బలోపేతం చేస్తాం. జిల్లాలో పాదయాత్ర పూర్తికాగానే తెదేపా సభ్యత్వం తీసుకుంటా. నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్రను విజయవంతం చేస్తాం’’ అని ఆనం వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన అనంతరం నేతలంతా ఆనంతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. అక్కడ ఆత్మకూరు నియోజకవర్గ తెదేపా-వైకాపా కార్యకర్తలు ఆనంతో సమావేశం కానున్నారు. వెంకటగిరి, నెల్లూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని తన అనుచరులతో ఆనం రేపు భేటీ కానున్నట్లు సమాచారం.

కాగా అంతకు ముందు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దాదాపు గంట పాటు చంద్రబాబు, ఆనం భేటీ అయ్యారు. నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే అభియోగంపై ఆనంను వైకాపా నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మరి ఈ భేటీ పట్ల వైకాపా నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..

Exit mobile version