Kodali Nani: రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి ఉద్యమం అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. మూడు ప్రాంతాల అభివృద్ది చెందాలన్నదే తమ లక్ష్యం అని అన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన విశాఖ గర్జన ర్యాలీలో కొడాలి నాని పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కొడాలి నాని మాట్లాడుతూ.. వర్షంలోనూ ప్రజలు వికేంద్రీకరణ ఆకాంక్షను తెలిపారని అన్నారు. చంద్రబాబు ఒక 420 అని.. పిల్లనిచ్చి, పార్టీలో చేర్చుకున్న ఎన్టీఆర్‌ను మోసం చేశారని మండిపడ్డారు. నారా లోకేష్ కోసం.. జూనియర్ ఎన్టీఆర్‌తో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చంద్రబాబు వేధిస్తున్నారని అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు విశాఖ పరిపాలన రాజధాని కావడంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. టీడీపీ, జనసేన పార్టీలను.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 టీవీలను, పేపర్లను ఉత్తరాంధ్ర ప్రజలు బ్యాన్ చేయాలని కోరారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహి అని విమర్శించారు. ఉత్తరాంధ్ర కోసం అందరూ గొంతెత్తి నినదించాలని అన్నారు. ప్రతి ఒక్కరు మూడు రాజధానుల అవశ్యకతను వివరించాలన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్దిని అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర కోసం రాజకీయ పోరాటం చేస్తామని చెప్పారు. ఏ పోరాటానికైనా అందరూ సిద్దంగా ఉండాలని అన్నారు. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వెనుకబాటు పోవాలంటే రాజధాని రావాలని అన్నారు. విశాఖపట్నంకు రాజధాని రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు.
నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ హనుమంతు లజపతి రాయ్ మాట్లాడుతూ.. వికేంద్రీకరణకు మద్దతుగా చేపట్టిన విశాఖ గర్జన ర్యాలీని విజయవంతం చేసినందుకు కృతజ్ఞలు తెలిపారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. విశాఖపట్నంకు రాజధానిని సాధించి తీరుతామని తెలిపారు.ఈ ర్యాలీలో స్పీకర్ తమ్మినేని సీతారామ్, మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు, ఉత్తరాంధ్ర వైసీపీ ప్రజాప్రతినిధులు, పలు వర్గాలకు చెందినవారు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.