Site icon Prime9

Mahanadu 2023 : తెలుగుదేశం పార్టీ “మహానాడు 2023” కు సర్వం సిద్దం.. భారీగా ఏర్పాట్లు చేసిన నేతలు

all arrangements set for telugu desam party mahanadu-2023

all arrangements set for telugu desam party mahanadu-2023

Mahanadu 2023 : తెలుగుదేశం పార్టీ.. మహానాడు 2023 కు రెడీ అయ్యింది. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి మహానాడు నిర్వహణలో కీలక పాత్ర వహిస్తూ ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మహానాడును 38 ఎకరాల విశాలమైన గ్రౌండ్‌లో ఏర్పాటు చేశారు. దాదాపు 10 నుంచి 15 లక్షల మంది వరకు దీనికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 27న ప్రతినిధుల సభ, 28న బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను కూడా ఇక్కడే ముగించనున్నారు.

సర్వం సిద్దం చేసిన తెదేపా నేతలు..

శనివారం భూలోకమ్మ గుళ్ళు సమీపంలో.. టీడీపీ ప్రతినిధుల సభ జరగనుంది. దీనికి సుమారు 15 వేల మంది రావొచ్చని అంచనా వేస్తున్నారు. అక్కడ అధునాతన సౌకర్యాలతో హైదరాబాద్ కు చెందిన కేకే ఈవెంట్ సంస్థ ఏర్పాట్లు చేసింది. వర్షాన్ని, ఎండలను తట్టుకునే విధంగా వేదికను రూపొందించారు. రక్తదానం శిబిరం, ఫొటో ఎగ్జిబిషన్, ప్రెస్ గ్యాలరీ, భోజన హాల్స్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. గోదావరి రుచులను, ఆతిథ్యాన్ని మహానాడులో రుచి చూపించేలా ఏర్పాట్లు చేశారు.

ఈ మహానాడుకు తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు. వారి కోసం రాజమహేంద్రవరం తోపాటు.. పరిసర ప్రాంతాల్లోని హోటల్స్, కళ్యాణ మండపాలు, గెస్ట్ హౌస్‌లు బుక్ చేశారు. అన్నీ పది రోజులు క్రితమే బుక్ అయిపోయాయి. ఇక పోలీసులు, సిబ్బంది ప్రభుత్వ పాఠశాల్లో ఉండి విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేశారు. మహనాడు జరిగే ప్రదేశాలతో పాటు.. జాతీయ రహదారి పొడవునా భారీ ఫ్లెక్సీలను, కటౌవుట్లను ఏర్పాటు చేశారు.

 

15 తీర్మానాల ప్రకటన..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం రాజమండ్రి చేరుకోనున్నారు. మహానాడు, చంద్రబాబు రాక నేపథ్యంలో.. రాజమండ్రి అంతా తెలుగుదేశం పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. అయితే.. ఎన్నికల సంవత్సరంలో జరిగే ఈ మహానాడు కీలక ప్రకటనలకు వేదిక అయ్యే అవకాశం ఉంది. 2024 ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మేనిఫేస్టోను ఇక్కడ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యంగా తెలుగుదేశం మహానాడులో ఏపీకి సంబంధించి 15 తీర్మానాలు చేయనున్నారు.

1993లో రాజమహేంద్రవరంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు . 1994లో తెదేపా అధికారంలోకి వచ్చింది. మళ్లీ 30 ఏళ్ల తరువాత ఇప్పుడు మరోసారి రాజమహేంద్రవరం లోనే ఘనంగా మహానాడు కార్యక్రమాన్ని చేయనుండడంతో 2024 లో మళ్లీ తెదేపా అధికారంలోకి రావడం ఖాయం అని .. ఈ ‘మహానాడు’తో రానున్న ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తాం అని తెదేపా నేతలు ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version