Ambati Rambabu: వారాహి విజయ యాత్ర అనేది అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ వెంట ఉన్నది జనసైనికులు కాదని.. సైకిల్ సైనికులని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ నిజంగా నిజాయితీ పరుడు అయితే.. అవినీతి పరుడైన చంద్రబాబుకు ఎందుకు సపోర్ట్ చేశారని ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జనసేన అధినేతపై విమర్శలు గుప్పించారు.
కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లి పవన్ సభలు పెడుతున్నారు. ఇదంతా నక్కజిత్తుల చంద్రబాబు జిమ్మిక్కు. అవనిగడ్డలో మధ్యాహ్నం మూడుగంటలకు సభ అని ప్రకటించారు. అయితే జనాలు రాలేదు. పవన్, నాగబాబు కారవాన్ లోకి వెళ్లి కూర్చున్నారు. సాయంత్రం ఐదు,ఆరు గంటల దాకా ఇదే పరిస్దితి. దీనితో టీడీపీ కార్యకర్తలు రావాలంటూ ఫోన్లు చేసుకున్నారు. ఢిల్లీ నుంచి లోకేష్ కూడా వారాహి సభకు వెళ్లాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఇక్కడ అచ్చెన్నాయుడు కూడా చెప్పారు. అయినా జనం రాలేదు. చంద్రాబుతో పొత్తును జనం ఛీ కొట్టారని అంబటి అన్నారు. బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీతో కలిసేందుకు సిగ్గు లేదా? అని అంబటి ప్రశ్నించారు.
పవన్ రాజకీయాలకు పనికిరాడు..(Ambati Rambabu)
2014 లో టీడీపీకి సపోర్టు చేసి అధికారంలోకి వచ్చాక వారు ఏమి చేసినా ఐదేళ్లు సైలెంట్ గా ఉన్నావు. నా మీద కేసులు పెట్టుకోండి అంటున్నావు. ఏదైనా తప్పు జరిగితే కేసులు పెడతారు. చంద్రబాబు అవినీతి సొమ్ము నీ అక్కౌంట్ లోనో, బంధువుల, మనోహర్ అక్కౌంట్లోనో పడ్డాయేమో మరి అని అంబటి అన్నారు. జగన్ అధికారంలోకి రాడన్నాడు. వచ్చాడు కదా.. అప్పడప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేవాడికి ఏమీ తెలియదు. షూటింగ్ విరామసమయంలో వచ్చి చంద్రబాబు చెప్పినట్లు మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఓట్లు కొనడానికి డబ్బులు లేవంటాడు. కాని చంద్రబాబు ఇస్తాడు కదా.. ఇద్దరు కలిసి గంగలో దూకినా లాభంలేదు. ఒక సినిమా యాక్టర్ డబ్బులు లేవని బీద అరుపులు అరిస్తే ఎవడు నమ్ముతాడు? నూటికి నూరుపాళ్లు రాజకీయానికి పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అంబటి అన్నారు. హైదరాబాద్ లో షూటింగులు చేసుకుంటూ విరామంలో ఏపీకి వచ్చి చంద్రబాబు చెప్పిన మాటలనే పవన్ చెబుతాడని అంబటి ఎద్దేవా చేసారు.