Chandrababu Quash Petition: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఇవాళ క్వాష్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్దార్థ లూథ్రా, అభిషేక్ మను సింఘ్వీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
చంద్రబాబుకి 17ఏ వర్తిస్తుందన్న లాయర్లు..(Chandrababu Quash Petition)
చంద్రబాబుకి అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు. ఇది రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు పెట్టిన కేసని వారు వాదించారు. అయితే 2018కి ముందు జరిగిన కేసు కాబట్టి గవర్నర్ అనుమతి అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. కానీ ఎఫ్ఐఆర్ 2021లో జారీ అయిందని, విచారణ ప్రారంభమైన తేదీ ప్రకారం 17 ఏ వర్తిస్తుందని చంద్రబాబు లాయర్లు చెప్పారు. అయితే హైకోర్టుకి సమర్పించిన పత్రాలన్నీ తమ ముందు ప్రవేశ పెట్టాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. విచారణని ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనకి బెయిలివ్వాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది.
లోకేష్ సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా..
మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా పడింది. రేపు జరగాల్సిన సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. సిఐడి ఇచ్చిన 41ఏ నోటీసుల్లోని నిబంధనలని నారా లోకేష్ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకి లోకేష్ హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో విచారించాలని హైకోర్టు సిఐడిని ఆదేశించింది. మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సిఐడి ఇచ్చిన 41ఏ నోటీసు ఫాలో కాకపోతే అరెస్ట్ చేయవచ్చని హైకోర్టు తేల్చి చెప్పింది.
అసైన్డ్ భూముల కేసులో విచారణ 16కి వాయిదా..
అమరావతి అసైన్డ్ భూముల కేసులో విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 16కి వాయిదా వేసింది. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.అమరావతి అసైన్డ్ భూముల కేసులో రేపు విచారణకు హాజరుకాలేనని పిటిషన్ లో వెల్లడించారు. రేపటి గైర్హాజరుకు అనుమతించాలని పిటిషన్ లో నారాయణ కోరారు. నాలుగైదు రోజులు సమయమివ్వాలని కోరారు. దీనిపై విచారణ ఈ నెల 16కి వాయిదా పడింది.
భువనేశ్వరిని కలిసిన అమరావతి రైతులు..
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భువనేశ్వరిని అమరావతి రైతులు కలిశారు. జగన్ అనే రాక్షసుడినుంచి సత్యభామ లాగా చంద్రబాబును కాపాడుతున్నారన్నారు. భువనేశ్వరిని కలవడానికి వెళ్తుండగా పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడం దారుణమని రైతులు అన్నారు. చంద్రబాబు త్వరలోనే బయటకి వస్తారని వారు అన్నారు. ఏపీని జగన్ అప్పుల ఊబిలో దించి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.