TTD EO Dharma Reddy: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2023 డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు 6.47 లక్షల మంది భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి నిర్దేశించిన సమయంలోనే సంతృప్తికరంగా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించామన్నారు. దర్శించుకున్న భక్తులతోపాటు అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య గతం కంటే పెరిగిందని చెప్పారు. భక్తులు క్యూలైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేశామన్నారు. 10 రోజులకు కలిపి విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి మొత్తం 19,255 టికెట్లు జారీ చేశామని, 18,578 మంది హాజరుకాగా, 677 మంది(3.3 శాతం) గైర్హాజరయ్యారని తెలిపారు. దాతలకు బ్రేక్ దర్శనానికి సంబంధించి ఆన్‌లైన్‌లో మొత్తం 6,858 టికెట్లు బుక్ చేసుకున్నారని, 6,388 మంది హాజరుకాగా, 470 మంది(7 శాతం) గైర్హాజరయ్యారని వివరించారు.
శ్రీవాణి దాతలకు మొత్తం 20 వేల ఎస్ఇడి టికెట్లు జారీ చేశామని, 19,083 మంది హాజరుకాగా, 917 మంది(4.5 శాతం) గైర్హాజరయ్యారని తెలియజేశారు. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి మొత్తం 2.25 లక్షల టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారని, 1,97,524 మంది హాజరుకాగా, 27,476 మంది(12.2 శాతం) గైర్హాజరయ్యారని తెలిపారు. సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు మొత్తం 4.23 లక్షలు మంజూరు చేశామని, 3,24,102 మంది హాజరుకాగా, 90,850 మంది(21.5 శాతం) గైర్హాజరయ్యారని వెల్లడించారు. అదేవిధంగా, ఈ పది రోజులకు కలిపి రూ.40.20 కోట్లు హుండీ కానుకలు అందాయని, 17.81 లక్షల మంది అన్నప్రసాదాలు, 35.60 లక్షల మంది లడ్డూ ప్రసాదాలు స్వీకరించారని, 2.14 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు.
మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఈవో సమాధానమిస్తూ అలిపిరి పాదాల మండపం వద్దగల రాతిమండపం కూలిపోయే స్థితికి చేరుకుందని, దీని పునర్నిర్మాణానికి సంబంధించి భారత పురావస్తు శాఖకు పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదని తెలిపారు. నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి ఆలయ గోడ కూలిందని, దీనికి సంబంధించి పురావస్తు శాఖకు లేఖలు రాసినా స్పందించడం లేదని చెప్పారు. రాతిమండపాలు, ఆలయాల పునర్నిర్మాణానికి సంబంధించి టీటీడీలో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణ విభాగం ఉందని, ఇక్కడ నిపుణులైన స్థపతులు ఉన్నారని వివరించారు. ఎస్వీ శిల్ప కళాశాల ఆధ్వర్యంలో ఎంతో మంది నిపుణులను తయారవుతున్నారని, వీరు విగ్రహాల తయారీతోపాటు, చక్కగా ఆలయాలు నిర్మించగలరని తెలియజేశారు. ఇటీవల జమ్మూకాశ్మీర్, వైజాగ్, హైదరాబాద్, ఒడిశా, కన్యాకుమారి, సీతంపేట, రంపచోడవరం ప్రాంతాల్లో అత్యంత సుందరంగా రాతి కట్టడంతో ఆలయాలు నిర్మించామని వెల్లడించారు.
అలిపిరి నడకమార్గంలో ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత, ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించినపుడు వెంటనే భక్తులను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర అటవీశాఖకు రూ.3.5 కోట్లు అందించామని, దీంతో అత్యాధునిక ట్రాప్ కెమెరాల కొనుగోలుతో పాటు ఇతర చర్యలు చేపడతారని ధర్మారెడ్డి చెప్పారు.