AP Assembly Elections:ఏపీలో ఓటరు చైతన్యం పోటెత్తుతోంది. ఉదయం పదకొండు గంటలవరుకు 25 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద జన సందడి నెలకొంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులు, మహిళలు ఓటు వేసేందుకు అధికంగా ఆసక్తి చూపుతున్నారు.కొత్తగా ఓటు హక్కు వినియోగించుకునే వారు కూడా ఎంతో ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు .కొన్ని చెదురు మదురు ఘర్షణ ల మినహా మొత్తం మీద పోలింగ్ సాఫీగానే సాగుతుంది .
తెనాలిలో ఉద్రిక్తత..(AP Assembly Elections)
గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే శివకుమార్ క్యూలైన్ లో వెళ్లకుండా నేరుగా వెళ్లడంపై ఓటరు అభ్యంతరం తెలిపారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఓటరుపై దాడి చేయగా.. వెంటనే ప్రతిఘటించిన ఓటరు ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరులు ఓటరుపై దాడికి దిగారు.
తెలంగాణలో ఓటువేసిన ప్రముఖులు..
తెలంగాణలో ఉదయం 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్ నమోదయ్యింది. హైదరాబాద్ పార్లమెంట్ లో 10.70 శాతం, మల్కాజ్ గిరిలో 15.05, సికింద్రాబాద్ లో 15.77,చేవెళ్ల 20.35 శాతం పోలింగ్ నమోదయ్యింది. మహబూబాబాద్ లో 30.66 శాతం, నల్గొండలో 31.21 శాతం, పెద్దపల్లి పార్లమెంట్లో 26.33 శాతం, నిజామాబద్ లో 28.26, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 16.34 పోలింగ్ నమోదయ్యింది.పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఓటు వేశారు. సినీనటుడు ఎన్టీఆర్ ఇదే పోలింగ్ కేంద్రంలో కుటుంబంతో కలిసి వచ్చి ఓటు వేశారు. జూబ్లీహిల్స్‌లో సినీనటుడు చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ మాదాపూర్‌లో, బర్కత్‌పురాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఫిలింనగర్‌లో సినీనటుడు అల్లు అర్జున్, మలక్‌పేటలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి, మేడ్చల్ మండలం పూడూరులో భాజపా నేత ఈటల రాజేందర్, నానక్‌రామ్‌గూడలో నటుడు నరేష్, కుందన్‌బాగ్‌లో జయేశ్ రంజన్, జూబ్లీహిల్స్‌లో సినీ దర్శకుడు తేజ, తార్నాకలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు.