Center notices to Telangana: రెండు రోజుల్లో రూ.152 కోట్లు తిరిగి ఇవ్వాలి.. తెలంగాణకు కేంద్రం నోటీసులు

ఉపాధి హామీ పథకం నిధులు దారి మళ్లించారని ఆరోపిస్తూ తెలంగాణ సర్కారుకు కేంద్రం నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.

  • Written By:
  • Publish Date - November 28, 2022 / 12:35 PM IST

Telangana News: ఉపాధి హామీ పథకం నిధులు దారి మళ్లించారని ఆరోపిస్తూ తెలంగాణ సర్కారుకు కేంద్రం నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయని సీరియస్ అయిన కేంద్రం… నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల గడువు ఇచ్చింది. లేకుంటే తర్వాత వాయిదాలు నిలిపేస్తున్నట్టు హెచ్చరించింది.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఇజీఎస్) నిధులను కేంద్ర పథకం మార్గదర్శకాల ప్రకారం అనుమతించని పథకాలకు మళ్లించినందుకు రూ. 151.9 కోట్లు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు పంపించింది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు కేసీఆర్ సర్కార్ కు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నవంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఈ మొత్తాన్ని చెల్లించకపోతే.. తదుపరి వాయిదాలను నిలిపివేస్తామని తెలిపింది.

అయితే ఇప్పటికే తెలంగాణలోని కేసీఆర్ సర్కార్‌కు, కేంద్రంలోని మోదీ సర్కార్‌కు మధ్య యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈడీ, ఐటీ దాడులతో టీఆర్ఎస్ నేతలను హడలెత్తిస్తున్న కేంద్రం తాజాగా ఈ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.