Ys Sunitha : ఏపీ రాజకీయాలు మరింత ముదురుతున్నాయా అంటే ప్రస్తుత పరిస్థితులను చూస్తే అవుననే అనిపిస్తుంది. తాజాగా ప్రొద్దుటూరులో అంటించిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఆ పోస్టర్స్ లో రాసుకొచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు వేసిన పోస్టర్లతో ఏపీ రాజకీయాల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రొద్దుటూరు వైఎమ్మార్ కాలనీలో గల ఆంజనేయస్వామి గుడి దగ్గర టీస్టాల్ గోడలపై ఈ పోస్టర్లు అంటించారు. ఒకవైపు వివేకా హత్య కేసు విచారణ విషయం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా మంచి బజ్ ఉన్న విషయం. ఇప్పుడు వీటికి తోడు ఆయన కుమార్తె తెదేపాలో చేరతారంటూ వెలిసిన ఈ పోస్టర్లు పెద్ద రచ్చే క్రియేట్ చేశాయి.
ఆ పోస్టర్లలో సునీతతో పాటు.. ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, తండ్రి వైఎస్ వివేక ఫొటోలు కూడా ఉన్నాయి. అలాగే పలువురు తెదేపా నేతల ఫోటోలు కూడా ఉన్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు కారణమైన వారికి శిక్ష పడాలనే సంకల్పంతో వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి పోరాటం చేస్తున్నారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులు వైఎస్ కుటుంబ సభ్యులే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా సునీత మాత్రం తన తండ్రి హత్యలో నిందుతులు ఎవరైనా వారికి శిక్ష పడాలనే ధ్యేయంతో పోరాడుతున్నారు. ఈ పోరాటంలో తనకు..తన కుటుంబానికి హాని ఉందని తెలిసినా..చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చినా ఆమె ఏమాత్రం భయపడకుండా సుప్రీంకోర్టు వరకు పోరాటాన్ని తీసుకెళ్లారు.
వివేకా హత్య కేసులో ప్రధాన నిందుతులు అయినా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కారు సునీతారెడ్డి. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను కొట్టివేసింది. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డికి ఇక అరెస్ట్ భయం పెరిగిందనే చెప్పాలి. సుప్రీం కోర్టు ఇచ్చిన షాక్ తో హైదరాబాద్ నుంచి పులివెందులకు పయనమయ్యారు అవినాశ్ రెడ్డి. మధ్యాహ్నాం సీఎంవోలో ప్రజా దర్భార్ నిర్వహించటానికి సిద్ధమయ్యారు. ఇక ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు మ.2:30కి తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది. ఈ క్రమంలో సుప్రీం ఆర్డర్ కాపీ అందలేదంటూ అవినాష్ అడ్వొకేట్ తెలిపారు. సుప్రీం వెబ్‌సైట్‌లో ఆర్డర్ కాపీ అప్‌లోడ్ కాలేదు.. దీంతో ఆర్డర్ కాపీ చూశాకే తీర్పు వెల్లడిస్తామన్న హైకోర్టు స్పష్టం చేసింది.
సునీత పోస్టర్లపై ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జ్ ప్రవీణ్ స్పందించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు వైసీపీ నాయకులు ప్రొద్దుటూరును ఎంచుకున్నారు. వివేక హత్య కేసును డైవర్ట్ చేసేందుకే వైఎస్ సునీత రాజకీయ ప్రవేశమంటూ పోస్టర్లు అంటించారంటూ పేర్కొన్నారు. వైఎస్ సునీత పోస్టర్లు ఎవరు అంటించారో గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.