Site icon Prime9

AP MLC Elections : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో “వైసీపీ” విజయ దుందుభి.. 4 స్థానాలు కైవసం

ycp candidates wins in ap mlc elections

ycp candidates wins in ap mlc elections

AP MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఈ నెల 13న ఏపీ లోని 3 గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ స్థానంలో ఎన్నికల పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఉదయం 8 గంటల నుంచి అధికారులు ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. కాగా ఆయా లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. తొలుత స్థానిక సంస్థల కోటా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు భారీ సంఖ్యలో ఉండటంతో తుది ఫలితాలు వెళ్లడయ్యేందుకు కొంత సమయం పట్టనుంది.

శ్రీకాకుళంలో నర్తు రామారావు విజయం..

శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం వెలువడింది. వైకాపా అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించారు. ఈ ఎన్నికలో మొత్తం 752 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటు వేయగా.. రామారావుకు 632 ఓట్లువచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆనేపు రామకృష్ణకు 108 ఓట్లు రాగా.. 12 ఓట్లు చెల్లలేదు.

పశ్చిమ గోదావరిలో కవురు శ్రీనివాస్‌, వంకా రవీంద్రనాథ్‌ గెలుపు.. (AP MLC Elections) 

పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైకాపా అభ్యర్థులే గెలుపొందారు. వైకాపా అభ్యర్థులు కవురు శ్రీనివాస్‌, వంకా రవీంద్రనాథ్‌ విజయం సాధించారు. మొత్తం 1105 ఓట్లు ఉండగా.. 1088 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు వేశారు. వైకాపాకు చెందిన కవురు శ్రీనివాస్‌కు 481 మొదటిప్రాధాన్యతా ఓట్లు వచ్చాయి. వంకా రవీంద్రనరాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్‌కు 120 ఓట్లు వచ్చాయి.

కర్నూలులో డాక్టర్‌ మధుసూదన్‌ విక్టరీ.. 

కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి డాక్టర్‌ మధుసూదన్‌ విజయం సాధించారు. మొత్తం ఓట్లు 1136 కాగా.. వీటిలో 53ఓట్లు చెల్లలేవు. వైకాపా అభ్యర్థికి 988 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థి మోహన్‌ రెడ్డికి 85 ఓట్లు వచ్చాయి. మరో స్వతంత్ర అభ్యర్థి వెంకట వేణుగోపాల్‌ రెడ్డికి 10 ఓట్లు వచ్చాయి. ఇంకోవైపు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఓట్ల లెక్కింపు అనంతపురం జేఎన్టీయూలో కొనసాగుతోంది.

ఉత్తరాంధ్రలో ఫలితానికి 48 గంటలు..

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు 48 గంటలు పడుతుందని అంచనా. ఆరు జిల్లాల్లో కలిపి 2లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. 2007, 2011, 2017లలో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ రెండో ప్రాధాన్య ఓటుతోనే అభ్యర్థులు విజయం సాధించారు. ఈసారి కూడా ఆ ఓటే కీలకం కానుందని సమాచారం. విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో 500 మంది సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి.. విడతల వారీగా ఓట్ల లెక్కింపులో పాల్గొననున్నారు. ఏడు రౌండ్లలో 2,00,926 ఓట్లు లెక్కింపునకు కనీసం 10 నుంచి 12గంటలు పడుతుంది అని సమాచారం అందుతుంది. కాగా ఆయా ఫలితాల మేరకు అభ్యర్ధులను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. సోషల్ మీడియాలో కూడా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వైకాపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు.

Exit mobile version