Matka Review: ‘మట్కా’ మూవీ రివ్యూ – వరుణ్‌ తేజ్‌ ఈసారైనా హిట్‌ కొట్టాడా?

  • Written By:
  • Updated On - November 14, 2024 / 06:24 PM IST

Matka Movie Review In Telugu: మెగా హీరో వరుణ్‌ తేజ్‌ కొంతకాలంగా మంచి హిట్‌ కోసం చూస్తున్నాడు. ఈ మధ్య అతడు నటించిన సినిమాలేవి వర్కౌట్‌ కావడం లేదు. చివరిగా అతడు నటించిన ‘గాంఢీవధారి అర్జున’, ‘ఆపరేషన్‌ వాలంటైన్‌’ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఈసారి ఓ భారీ హిట్‌ కొట్టేందుకు వైవిధ్యమైన కథ ‘మట్కా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పలాస్‌ ఫేం కరుణ కుమార్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే మూవీ టీజర్‌, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులో వరుణ్‌ తేజ్‌ వైవిధ్యమైన గెటప్‌లో కనిపించడంతో మూవీపై బజ్‌ క్రియేట్‌ అయ్యింది. మరి వరుణ్‌ తేజ్‌ ప్రయోగం ఫలించిందా? థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ మెప్పించిందా? చూద్దాం!

కథ:
అనాథైన వాసు అనే కుర్రాడి కథే ఈ మట్కా. బర్మా నుంచి వైజాగ్‌కు శరణార్థిగా వచ్చిన వాసుకి శరణార్థి శిబిరంలో ప్రసాద్‌(‘సత్యం’ రాజేష్‌) పరిచయం అవుతుంది. ఇద్దరు మంచి స్నేహితులు అవుతారు. ఒక రోజు అనుకోని పరిస్థితుల్లో వాసు ఓ వ్యక్తిని హత్య చేయాల్సి వస్తుంది. దీంతో అతడు చిన్నతనంలోనే జైలుకు వెళతాడు. అక్కడ జైలు వార్డెన్‌ నారాయణ మూర్తి (రవిశంకర్‌) తన స్వప్రయోజనం కోసం వాసుని ఫైటర్‌లా మారుస్తాడు. జైల్లో కొన్నేళ్లు శిక్ష అనుభవించిన వాసు ఆ తర్వాత విడుదలవుతాడు. బయటకు రాగానే పని వెతుక్కుంటూ పూర్ణ మార్కెట్‌ చేరుకుంటాడు.

అక్కడ కొబ్బరి కాయల వ్యాపారి అప్పల రాజు(అజయ్‌ ఘోష్‌)తో దగ్గర పని చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్కెట్‌లో కేబీ రెడ్డి(జాన్‌ విజయ్‌) అనే రౌడీ గ్యాంగ్ గొడవ చేస్తుంది. ఈ గొడవలో వారిని చితక్కొడతాడు. అది చేసిన కేబీ రెడ్డి పత్యర్థి నానిబాబు (కిషోర్‌) వాసుని తన దగ్గర పెట్టుకుంటాడు. అప్పటి నుంచి నానిబాబు సహచరుడిగా ఉంటూ సహాకారంతో పూర్ణ మార్కెట్‌కు నాయకుడిగా ఎదుగుతాడు. అప్పటి నుంచి వాసు జీవితం ఎలా సాగింది? బట్టల వ్యాపారం చేయాలనుకున్న వాసు మట్కా ఆటలోకి ఎలా ప్రవేశించాడు? మట్కా కింగ్‌గా ఎలా ఎదిగాడు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు అతడిని టార్గెట్‌ చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

అండర్‌ డాన్‌ కథలంటే ప్రేక్షకుల్లో ఓ అంచనాలు ఉంటాయి. ఇలాంటి కథలు మనకు కొత్త కాదు. ఈ జానర్లో ఇప్పటికే చాల సినిమాలు వచ్చాయి. కానీ అందులో హీరో క్యారెక్టరైజేషన్‌, యాక్షన్‌ ఎలివేషన్స్‌తో సినిమా ఆసక్తిని పెంచుతుంది. కానీ మట్కాలో అలాంటి ఆసక్తి ఎలిమెంట్స్‌ ఏవి లేవు. ఇందులో మట్కా అనే ఆట మాత్రమే కొత్త పాయింట్‌. హీరో క్యారెక్టరైజేషన్‌, మట్కా అనే గ్యాంబ్లింగ్‌ ఆట అతడు తన నేర సామ్రాజ్యాన్ని స్థాపించుకునే జర్నీని కొత్త చూపించడంలో డైరెక్టర్‌ ఫెయిల్‌ అయ్యాడనే చెప్పాలి. అంతేకాదు యాక్షన్‌ సీన్స్‌లో కూడా పెద్దగా ఎలివేషన్స్‌ లేవు. చాలా సాదాసిదా సాగింది. ప్రస్తుతం పాన్‌ ఇండియా ట్రెండ్‌ పోటీ పడుతున్న క్రమంలో మట్కా అనే కొత్త పాయింట్‌ తీసుకుని రోటిన్‌ స్టోరీ తీశాడు అనిపిస్తోంది.

ఇందులో బలమైన కథ ఉన్న కనెక్టివిటీ మిస్‌ అయ్యింది. ఈ కథ ప్రధానంగా మట్కా ఆట చూట్టూ తిరుగుతుంది. ఎవరూ లేని ఓ కుర్రాడు చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడి చివరికి మట్కా ఆటతో తన నేర సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాడు. ఈ చిన్న ఆటతో దేశ ఆర్థిక వ్యవస్థనే సంక్షోభంలోకి నెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని వణికించడం కొత్తగా ఉంది. కానీ ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యేలా చూపించలేదని చెప్పాలి. ఫస్టాఫ్‌ మొత్తం సాదిసిదాగా సాగింది. కొన్ని సన్నివేశాలు అయితే పాత సినిమాలను తలపించాయి. ఈ కథలో కీలకమైన మట్కా ఆట ఎపిసోడ్‌ ఇంటర్వెల్‌ వరకు గానీ మొదలు కాలేదు. సెకండాఫ్‌ అయినా థ్రిల్‌ చేస్తుందనుకుంటే అవేవి కనిపించలేదు. అసలు కథలో ఎక్కడ కొత్తదనం గానీ, థ్రిల్లింగ్‌గా అనిపించే అంశాలేవి లేవు.

సినిమా మొత్తం చాలా సాదాసిదాగా సాగుతుంది. అనామకుడైన హీరో బాల్యం నుంచి మట్కా కింగ్ వరకు ఎదిగినట్టు చూపించిన తీరు సినిమాటిక్‌ ఫీల్‌ ఇచ్చింది తప్పా సహజంగా అనిపించలేదు. ఇలాంటి డాన్‌ చిత్రాలకు బలమైన ప్రత్యర్థులు ఉంటారు. కానీ మట్కాలో హీరోకి అసలు ఎదురేలేదు అన్నట్టు సాగిపోతాడు. బలమైన ప్రత్యర్థి లేరు, పెద్దగా సవాళ్లు ఎదురుకాలేదు. ఏ దశలోనూ ఆసక్తి కలిగించే ఎలిమెంట్స్‌ లేకపోవడంతో సినిమా బోర్ కొట్టించింది. మట్కా కింగ్‌గా ఎదిగిన వాసుని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐని రంగంలోకి దింపుతుంది. అతడి ఆటను కట్టడి చేసేందుకు సీబీఐ చేసిన ప్రయత్నాలు, అతడి సామ్రాజ్యాన్ని కూల్చేందుకు ప్రత్యర్థులు పన్నాగాలను హీరో ఎలా తిప్పికొట్టాడనేది కీలకం.

కానీ ఇందులో ఆ మెజిక్‌ కనిపించలేదు. వాసు తన కూతురికి మేక – నక్క కథ చెబుతాడు. నిజానికి ఈ సమంలో ప్రేక్షకులు యాక్షన్ లేదంటే హీరో మైండ్ గేమ్‌ ఆశిస్తారు. కానీ అవేవి లేకుండా ఓ కథతో ఎమోషన్ చూపించి ప్రేక్షకుడిగా చిరాకు తెప్పించేలా ఉంది. క్లైమాక్స్‌ ఫైట్‌ సీన్‌ కూడా పెద్దగా ఆసక్తి కలిగించేలా లేదు. మొత్తానికి మట్కాతో డైరెక్టర్‌ ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్‌ అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాకి వరుణ్‌ తేజ్‌ నటన, కథ బలంగా ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోవడం దర్శకుడు తడబడ్డాడు.