NTR Satha Jayanthi : తెదేపా వ్యవస్థాపకులు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఈ ఏడాది అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు ఏడాది పొడవునా అనేక రకాల కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ శత జయంతి అయిన మే 28వ తేదీని మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.
కాగా ఇటీవలే విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపడం. వాటిపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి నందమూరి హీరోల్లో బాలకృష్ణ మాత్రమే హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరు కాకపోవడం పట్ల కొంతమేర అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే మరోమారు శత జయంతి ఉత్సవాల్లో భాగంగానే మే 20న హైదరాబాద్, కేపీహెచ్‌బీలో వేడుకలను నిర్వహించనున్నారు.
ఈ వేడుకలకు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, వెంకటేష్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ హాజరుకానున్నారని సమాచారం. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరందరికీ ఎన్టీఆర్ సావనీర్ కమిటీ ఛైర్మన్, టీడీపీ నేత టీడీ జనార్థన్ ఆహ్వానించారు. అయితే చిరంజీవి, నాగార్జునతో పాటు మహేష్ బాబు మాత్రం అటెండ్ కావడం లేదని తెలుస్తోంది. అయితే దగ్గుబాటి పురంధేశ్వరి సహా నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ ఉత్సవాల నిర్వహణ కమిటీ ఆహ్వానాలు పంపించింది. దీంతో టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ ఒకే వేదికపై చూసేందుకు అభిమానులంతా ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
ఇటీవల బాలయ్య ఏఎన్నార్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల వల్లే నాగార్జున దీనికి దూరంగా ఉంటున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే చిరంజీవికి, బాలకృష్ణకు మధ్య కూడా చిన్న విభేదాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇక మహేష్ బాబు సైతం షూటింగ్స్ బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోతుండవచ్చు. ఇదే క్రమంలో అమెరికాలో తెలుగువారు ఎక్కువగా నివసించే టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీలో మే 28న తెలుగు హెరిటేజ్ డే నిర్వహించేందుకు స్థానిక ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ తేదీని హెరిటేజ్ డే గా ప్రకటించాలని ఆ నగర మేయర్ జెఫ్ చేనిని తెలుగు వారు కోరగా అందుకు ఆయన ఒప్పుకున్నారు.