Hyderabad: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఇవాళ సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 21న ఒక రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ఆగస్ట్ 15న 75 మంది ఖైదీల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. డయాలసిస్ పేషంట్స్‌కి పెన్షన్ల ఆమోదంపై కూడా చర్చించనున్నారు. కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలనే దానిపై ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.
రాష్ట్రానికి ఆదాయ మార్గాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో కొర్రీలు పెట్టడం పై ప్రధానంగా చర్చ జరగనుంది. ఎఫ్‌ఆర్‌బీఎంకి లోబడి రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల జారీ ద్వారా తీసుకునే రుణాల్లో కేంద్రం కోత విధించింది. దీంతో పాటు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి బడ్జెట్ వెలుపలి అప్పులను కూడా కేంద్ర ప్రభుత్వంత తీసుకురావడంతో ప్రాజెక్టులు సహా ఇతర అవసరాల కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు నిలిచిపోయాయి.
దీనితో ప్రత్యామ్నాయంగా అదనపు వనరుల సమీకరణపై క్యాబినెట్‌లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. స్టేట్ ఓన్ రెవిన్యూ టాక్స్‌ల ద్వారా ఆదాయాన్ని అధికంగా సమకూర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డితో పాటు మిగతా 8 జిల్లాల్లో భూములపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో కొన్ని భూములను గుర్తించి అమ్మకాలు జరిపింది. ఇంకా నిరుపయోగంగా మిగిలి ఉన్న భూములను కూడా అమ్మాలని ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మునుగోడు బై పోల్ పై సైతం కాబినెట్‌లో చర్చించనున్నారు.