Site icon Prime9

Kotappakonda : ఆదుకో కోటయ్య.. చేదుకో కోటయ్య.. మహాశివరాత్రి “కోటప్పకొండ” స్పెషల్ స్టోరీ..

special story on maha sivaratri kotappakonda

special story on maha sivaratri kotappakonda

Kotappakonda : ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పలు రాష్ట్రాల్లోనూ మహా శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉండే కోటప్పకొండ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. కోటప్పకొండ సమీపంలోని గ్రామాలకు చెందిన వారు.. ప్రభలు కట్టుకుని కొండకు వెళ్లి శివయ్యను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తిరునాళ్ల రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు అందజేయడం విశేషం.

కాగా నేడు శివరాత్రి పర్వదినం సందర్భంగా.. కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఘాట్‌రోడ్డులోని విగ్రహాలకు ఈ ఏడాది రంగులు వేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు తాగునీరు, మజ్జిగ, పిల్లలకు పాలు, బిస్కట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. 2.50 లక్షల లడ్డూలు, 1.50 లక్షల అరిసె ప్రసాదాన్ని సిద్ధం చేశారు.

కోటప్పకొండ ప్రత్యేకత..

కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్లమార్గాన్ని సా.శ.1761లో నరసరావుపేట జమీందారు రాజా మల్రాజు నరసింహరాయణి నిర్మించాడు.

ఈ కొండను ఏ కోణం నుండి చూసినా (త్రికూటాలు) మూడు శిఖరాలు కనపడతాయి. కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలు బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం సా.శ. 1172 లో నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు, ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేసారు.

స్థల పురాణం..

పరమశివుడు మూడు కొండలపై జంగమదేవర రూపంలో ధ్యానంలో ఉండేవారు. కొండ సమీపంలోని కొండకావూరు గ్రామానికి చెందిన ఆనందవల్లి (గొల్లభామ) నిత్యం స్వామికి పాలను తీసుకెళ్లేది. ఆమె భౌతిక జీవితంపై కూడా ఆసక్తి లేకుండా శివుణ్ణి ఆరాదిస్తూ ఉండేది. ఈ తరుణంలోనే శివుడు ఆమె భక్తిని మెచ్చి గర్భం ప్రసాదిస్తాడు. ఆ తర్వాత గర్భం దాల్చడంతో కొండ ఎక్కలేనని, కిందకు రావాలని పరమశివుడిని కోరింది. ఆమె విజ్ఞప్తిని మెచ్చిన శివయ్య.. కొండ దిగుతున్న సమయంలో చివరి వరకు వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధించాడు. మధ్యలో వెనుదిరిగి చూస్తే శిల అయిపోతానని చెప్పాడు. మహేశ్వరుడి షరతు అంగీకరించిన ఆనందవల్లి ముందు నడుస్తుంటే.. స్వామి వెనుకే బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక భారీ శబ్దాలు రావటంతో ఆనందవల్లి వెనుదిరిగి చూసింది. ఆ వెంటనే స్వామి బ్రహ్మ శిఖరంపై శిల రూపంలో మారిపోయారు. కాబట్టి.. ఈ క్షేత్రంలో ఆనందవల్లిని దర్శించుకున్న తర్వాతే స్వామి వారిని దర్శించుకుంటారు.

ఇక చుట్టుప్రక్కల గ్రామాలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గ్రామాల ప్రజలు కోటప్పకొండకు ప్రభలు కట్టుకుని వెళతారు. ప్రభల విషయంలో గ్రామాల మధ్య పోటీ కూడా ఉంటుంది. ఈ ప్రభలపై ఏర్పాటు చేసే ప్రోగ్రామ్స్ ను చూస్తూ భక్తులు జాగారం చేస్తారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version