Sai Dharam Tej : మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. విభిన్న కథలతో, విలక్షణ పాత్రలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బైక్ యాక్సిడెంట్ తో ప్రాణాపాయం నుంచి బయట పడిన తర్వాత నటించిన తొలి చిత్రం విరూపాక్ష. మిస్టికల్ థ్రిల్లర్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం పట్ల సాయి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి, రాజకీయాల్లో ఎంట్రీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఈ మేరకు సాయితేజ్ మాట్లాడుతూ.. రాజకీయాలపై తనకు ఎలాంటి అవగాహన లేదన్నారు. తనకు తెలిసింది కేవలం సినిమాలు, క్రికెట్ మాత్రమేనన్నారు. అయితే తన మేనమామ.. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కార్యకర్తగా తన పూర్తి సహకారం ఎల్లవేళలా అందిస్తానన్నారు. గతంలోనే పవన్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే రాజకీయాల్లోకి రావాలని సూచించారని.. అదే సమయంలో రెండు పడవలపై ప్రయాణం చేయొద్దని తనతో చెప్పినట్లు సాయి ధరమ్ తేజ్ తెలిపారు. ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారానికి పవన్ మామ పిలిస్తే ఖచ్చితంగా వెళ్తానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ కామెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
అలానే గతంలో జరిగిన ప్రమాదాన్ని గురించి చెబుతూ.. ఆ రోజున జరిగిన ప్రమాదం గురించి ఎవరికి తోచింది వాళ్లు రాశారు. నేను కోలుకున్న తరువాత అవన్నీ చూసి నవ్వుకున్నానన్నాడు. అసలు నాకు మందు అలవాటు లేదు.. నేను ఆరోజు కూడా తాగలేదు. డ్రగ్స్ లాంటి వాటి జోలికి నేను వెళ్లలేదు. నాకు స్పోర్ట్స్ బైక్ అంటే ఇష్టం .. అందువల్లనే నేను కార్లో కాకుండా బైక్ పై వెళ్లాను. నిజానికి స్పీడ్ గా కూడా వెళ్లలేదు. నేను పబ్ కి వెళుతున్నట్టుగా కొంతమంది రాశారు .. కానీ నేను దేవ కట్టా గారి దగ్గరికి వెళుతున్నాను అని చెప్పాడు. అలానే నేను బైక్ పై నుంచి పడిపోగానే నన్ను గుర్తుపట్టి హాస్పిటల్లో జాయిన్ చేసిన వ్యక్తి ఇప్పటికీ నాకు టచ్ లోనే ఉన్నాడు. ఒక లక్ష రూపాయలు ఇచ్చేసి అతనికి థ్యాంక్స్ చెప్పచ్చు. అంతటి సాయాన్ని అలా లెక్కగట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నాకు కాల్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు.
ఇకపోతే విరూపాక్ష సినిమాలో మళయాల ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీతో సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందించారు.