Ajith Kumar : తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవాసరం లేదు. తమిళ లో స్టార్ హీరోగా ఉన్న అజిత్ కి… తెలుగు లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి హిట్ లుగా నిలిచాయి. ప్రస్తుతం అజిత్ నటించిన చిత్రం “తునీవు”. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా చివరగా వాలిమై చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు. కాగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీ విడుదల రోజే విజయ్ నటించిన వరిసు కూడా రిలీజ్ కానుంది. దీంతో పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలు షూరు చేశారు ఇరువురి అభిమానులు.
ఇక తమిళ్ లో విజయ్ ఫ్యాన్స్ కి – అజిత్ ఫ్యాన్స్ కి మధ్య సినిమా రిలీజ్ విషయంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ పలు సందర్భాల్లో గొడవలు పడ్డారు. ఇటీవలే దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తమిళనాట ఎంతటి దుమారాన్ని లేపాయో అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు చెన్నైలో ఎక్కడా చూసిన విజయ్, అజిత్ పోస్టర్స్, బ్యానర్లు కనిపిస్తున్నాయి. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో విజయ్ జోరుగా పాల్గొంటున్నారు. కానీ అజిత్ మాత్రం ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపు పది సంవత్సరాలుగా అజిత్ తన సినిమా ప్రమోషన్లలో, ఈవెంట్లలో కూడా పాల్గొనలేదు. కాగా అందుకు ఓ బలమైన కారణం ఉందని తెలుస్తుంది.
విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య ఎల్లప్పుడూ వార్ జరుగుతూనే ఉంటుంది. ఇక తమ హీరోస్ సినిమాల విడుదల సమయంలో వీరు చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతుంటుంది. గతంలో అజిత్, విజయ్ ల అభిమానులు రోడ్లపై గొడవపడ్డారు. చిన్నగా మొదలైన ఈ వివాదం క్రమంగా కొట్టుకునే వరకు చేరింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని మృతి చెందారు. దీంతో అభిమానుల మధ్య ఈ గొడవలను ఆపాలని… తాను వ్యక్తిగతంగా సినిమా ప్రమోషన్లలో పాల్గొనకూడదని అజిత్ నిర్ణయించుకున్నారట. అప్పటి నుంచి సినిమాను పూర్తిచేసి పక్కకు తప్పుకుంటారు. ఆ తర్వాత ఎలాంటి ప్రమోషన్, ఈవెంట్లలో పాల్గొనరని అంటున్నారు.
కాగా అజిత్ సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటారు. అభిమానుల ప్రేమ, ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని… వారు మంచి సినిమాలను ఎప్పుడూ ప్రేమిస్తారని అంటుంటారు. 2011లో తన ఫ్యాన్ క్లబ్స్ అన్నింటిని రద్దు చేసిన అజిత్… తనను “తల” అని పిలవవద్దంటూ కోరారు. ఓ మంచి సినిమాకు ప్రమోషన్ అవసరం లేదు అనే ఫార్ములాతో ముందుకు వెళ్తుంటారు హీరో అజిత్.