New Delhi: రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ లో మొత్తం 748 మంది పార్లమెంటు సభ్యుల ఓట్లను అధికారులు లెక్కించారు. ఈ ఓట్ల విలువ 5,23,600. ఇందులో 3,78,000 విలువైన 540 ఓట్లను ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకి లభించాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 1,45,600 విలువైన 208 ఓట్లు వచ్చాయి.15 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోయాయి.
ఇక ఎమ్మెల్యేల ఓట్లలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము భారీ ఆధిక్యం సాధించారు. ముర్ముకి 1349 ఎమ్మెల్యేల నుంచి నాలుగు లక్షల ఎనభై మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఓట్లు లభించినట్లు తెలుస్తోంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకి 537 మంది ఎమ్మెల్యేల నుంచి లక్షా ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెభ్బై ఆరు ఓట్లు లభించినట్లు సమాచారం.
ద్రౌపది ముర్ము విజయం లాఛనం కావడంతో దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఆయా రాష్ట్రాల బీజేపీ పార్టీ కార్యాలయాలలో బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకుంటున్నారు. పార్టీ కార్యాలయాల వద్ద కార్యకర్తలు స్వీట్లు తినిపించుకుంటున్నారు. మరోవైపు గిరిజనులు సాంప్రదాయ నృత్యం చేస్తూ ముర్ము విజయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ముర్ము విజయానికి సూచికగా సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ముర్ము సైకత శిల్పాన్ని రూపొందించి శుభాకాంక్షలు తెలిపారు. ముర్ము స్వస్థలం రాయ్ రంగాపూర్‌లోని ఆమె నివాసం విద్యుత్ కాంతుల వెలుగులతో మెరిసిపోతోంది.