Chandrababu Naidu : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సొంత నియోజకవర్గమైన కుప్పంలో చంద్రబాబు బుధవారం నుంచి తలపెట్టిన పర్యటనకు ప్రభుత్వం తరపున అడ్డంకులు మొదలయ్యాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై గానీ, ఇరుకు రోడ్లపై గానీ సభలు, సమావేశాలు నిర్వహించరాదంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరుల్లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ ఈ మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు పర్యటనలో రోడ్ షోలు, సభలు, సమావేశాలు, జనసమీకరణ వివరాలు అందజేయాలంటూ పోలీసులు నోటీసులిచ్చారు. అయితే ఆ నోటీసులపై టీడీపీ స్పందించని కారణంగా అనుమతి నిరాకరించారు పోలీసులు. అనుమతి లేకుండా పర్యటిస్తే కఠినచర్యలు తప్పవంటున్నారు.
కాగా చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్సీ సుధాకర్ రెడ్డి కుప్పానికి చేరుకుని టీడీపీ నేతలకు నోటీసులు అందజేశారు. బుధవారం శాంతిపురం మండలంలో మొదలయ్యే చంద్రబాబు పర్యటన మూడు రోజులపాటు సాగనుంది. ఎక్కడ పడితే అక్కడ చంద్రబాబు సభలు, సమావేశాలు పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు ఈ డివిజన్లో పోలీసు యాక్టు అమల్లో ఉంటుందన్నారు. గత ఏడాది నవంబరులో డివిజన్ లో శాంతిభద్రతల సమస్య తలెత్తినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విశాలమైన ప్రదేశాలను గుర్తించి, తమకు ముందస్తుగా సమాచారం ఇచ్చి అనుమతులు తీసుకున్నాకే సభలు నిర్వహించాలని స్పష్టం చేశారు. అనంతరం టీడీపీ నాయకులతో కలిసి చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించనున్న శాంతిపురం ఎన్టీఆర్ విగ్రహం కూడలికి డీఎస్సీ వెళ్లారు. అది జాతీయ రహదారి అయినందున అక్కడ బహిరంగ సభకు అనుమతినివ్వబోమన్నారు.
దీనిపై టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా, శాంతిపురంలో ఎన్టీఆర్ కూడలి వద్దే సభలు సమావేశాలు జరుపుకుంటారని తెలిపారు. చంద్రబాబు కుప్పం స్థానిక ఎమ్మెల్యే అయినందున ఆయన తన నియోజకవర్గంలో పర్యటించి ప్రజలను కలుసుకోవలసిన బాధ్యత ఉందని, ఆ ప్రకారం ఆయన వస్తున్నందువల్ల పర్యటనకు అనుమతి ఇవ్వాలని వారు కోరారు. ఏ గ్రామానికా గ్రామంలో స్థానిక ప్రజలతో సమావేశాలు ఉంటాయి. తప్ప రోడ్ షోలు, సభలు ఉండవని అందులో పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ నుంచి సరైన జవాబు రాలేదని… అందుచేత సభలకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. వాటిని నిర్వహించేవారిని, సదరు కార్యక్రమంలో పాల్గొనేవారిని అక్రమ సంఘటితంగా పరి గణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో పోలీసుల వైఖరి పట్ల తెదేపా నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తెదేపాకు జనంలో పెరుగుతున్న ఆదరణకు భయపడి జగన్ ఈ జీవో జారీ చేశారని చెబుతున్నారు. మరోవైపు పోలీసుల నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏం జరగనుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.