Modi Kuwait Tour: కువైట్‌ పర్యటనకు బయలుదేరిన మోదీ -43 ఏళ్ల తర్వాత తొలిసారిగా..

  • Written By:
  • Updated On - December 21, 2024 / 11:31 AM IST

PM Modi Kuwait Tour: ప్రధాని నరేంద్ర మోదీ కువైట్‌లో పర్యటించనున్నారు. ఆ దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న ఆయన నేడు శనివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని కువైట్‌ను సందర్శిస్తున్నారు. 1981లో అప్పటి ప్రధాని ఇందీరా గాంధీ కువైట్‌ను సందర్శించారు.

ఆ తర్వాత కువైట్‌లో పర్యటిస్తున్న రెండో భారత ప్రధాన మంత్రిగా మోదీ ఉన్నారు. ఆ దేశంలో ఆయన రెండు రోజుల పాటు ఉండనున్నారు. కువైట్‌ రాజు షేఖ్‌ మిషాల్‌ అల్‌అహ్మద్‌ అల్‌ జుబేర్‌ అల్‌ సహబ్‌ ఆహ్వానం మేరకు మోదీ కువైట్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశంతో ద్వైపాక్షిక సంబధాలపై ఇరు దేశ ప్రధానులు చర్చించనున్నారు. అదే విధంగా ఆ దేశంలోని అగ్ర నాయకులతో పాటు అక్కుడున్న భారతీయులను కలుసుకోనున్నారు.

భారత కార్మిక శిబిరాన్ని కూడా ఆయన సందర్శిస్తారు. అలాగే అరేబియా గల్ఫ్‌ కప్‌, ఫుట్‌బాల్‌ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. కాగా మోదీ, కువైట్‌ రాజు మధ్య రక్షణ, వాణిజ్యంతో సహా పలు కీలక రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు జరగనున్నట్లు తెలుస్తోంది. మోదీ ఆ దేశాన్ని సందర్శిస్తున్న సందర్భంగా ‘హలా మోదీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మోదీ కువైట్‌లో ఉన్న భారతీయులందరిని కలుసుకోనున్నారు.