Pawan kalyan Wishes Vijay Thalapathy: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎప్పుడో పార్టీని స్థాపించిన విజయ్.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నాడు. పార్టీ ద్వారా సామాజీక సేవలు నిర్వహించారు. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్న విజయ్ ఈ ఏడాది ప్రారంభంలో పార్టీను పేరును ‘తమిళగ వెట్రి కజగం’గా మార్చి అధికారిక ప్రకటన ఇచ్చాడు. అంతేకాదు సెప్టెంబర్ 8న ఎన్నికల సంఘం కూడా ‘తమిళగ వెట్రి కజగం’ రాజకీయ పార్టీగా అమోదిస్తూ.. రిజిస్టర్ పార్టీగా ఎన్నికల్లో పాల్గొనేందుకు అనుమతి కూడా ఇచ్చింది. హీరోగా కెరీర్ పీక్‌లో ఉండగానే ఆయన పొలిటిక్ ఎంట్రీ ఇచ్చేశాడు.
ఈ నేపథ్యంలో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించి తన పొలిటికల్ ఎంట్రీని ఖరారు చేశారు. దీంతో ఆయన అభిమానులు, తమిళనాడు ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఆయన పొలిటికల్ ఎంట్రీ స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విజయ్‌కి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు. “సాధువులు, సిద్దులకు నెలవైన తమిళనాడు గడ్డపై రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన విజయ్‌కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు.
ఇక నిన్న ఆదివారం జరిగిన విజయ్ తొలి రాజకీయ సభకు ప్రజల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. మహానాడులో జరిగిన ఈ కార్యక్రమానికి జనం పోటేత్తారు. దాదాపు 8 లక్షలకు పైగా ప్రజలు హాజరైనట్టు సమాచారం. ఇక ఈ సభలో సుదీర్ఘంగా ప్రసంగించిన విజయ్.. బీజేపీ, డీఎంకెలు తమ ప్రత్యర్థులుగా పేర్కొన్నారు. దీంతో తమిళనాడు రాజకీయాలు మరింత వేడిక్కినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం విజయ్ 2026 ఎన్నికల లక్ష్యంగా నిన్న జరిగిన సభలో ఆయన ప్రసగించారు. బటన్ నొక్కి పార్టీ జెండా ఆవిష్కరించిన విజయ్ అనంతరం పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. తనకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు కానీ.. రాజకీయాలకు భయపడటం లేదన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్దాంతాలే తమ పార్టీ భావజాలమన్నారు. ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తామని ఆయన స్పష్టం చేశారు.