New Delhi: క్రిప్టోకరెన్సీపై లోకసభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా క్రిప్టో కరెన్సీని నిషేధించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిందని తెలిపారు. కాగా వీసీకె ఎంపీ తిరుమావాలవన్ అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి స్పందిస్తూ, క్రిప్టో కరెన్సీని అనుమతిస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం చూపుతుందన్నారు. ఆర్‌బీఐ లేవనెత్తిన అభ్యంతరాల గురించి నిర్మలా సీతారామన్ ప్రస్తావిస్తూ, క్రిప్టో కరెన్సీ వాస్తవానికి అది కరెన్సీ కాద, ఆధునిక కరెన్సీని సెంట్రల్ బ్యాంకు లేదా ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. కరెన్సీ విలువను లేక కట్టేది ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధానమని, కరెన్సీ చట్టప్రకారం చెల్లుబాటు అయ్యేది తదితర అంశాలు ఆర్‌బీఐ పరిధిలోకి వస్తాయని ఆమె సభకు వివరించారు.
దీనికి వ్యతిరేకంగా క్రిప్టో కరెన్సీని తీసుకుంటే ఇది కేవలం స్పెక్యూలేషన్ ఆధారితంగా దాని విలువను లెక్క గడతారని, కరెన్సీపై ఎక్కువ ఎక్కువ లాభం ఆశిస్తారని, ఇది భారత్ లాంటి ఆర్థిక వ్యవస్థకు పనికి రాదని ఆమె స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గత ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశంలో క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లును మోదీ ప్రభుత్వం ఆమోదించింది. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా అధికారికంగా డిజిటల్ కరెన్సీని చలామణిలోకి తేవాలని నిర్ణయించింది. దీంతో పాటు ఈ బిల్లు ద్వారా దేశంలో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీని నిషేధించింది. అయితే ఈ బిల్లును కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టకుండా వాయిదా వేసింది.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశంలో వర్చువల్ డిజిటల్ కరెన్సీ ఆదాయం పై 30 శాతం పన్ను విధించారు. డిజిటల్ కరెన్సీని గిఫ్ట్‌గా ఇచ్చిన 30 శాతం పన్ను విధిస్తామని సభకు తెలియజేశారు. అయితే వర్చువల్ డిజిటల్ అసెట్స్ కింద క్రిప్టో కరెన్సీని చేర్చారా లేదా అని ఆమె స్పష్టత ఇవ్వలేదు.