New Delhi: ప్రతిపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరెట్ అల్వాను ప్రకటించాయి. ఈ విషయాన్ని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఆమెను తమ అభ్యర్థిగా నిలబెట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ సమావేశానికి హాజరుకాని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అల్వాకు మద్దతునిచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా మద్దతు ఇవ్వనున్నాయి.
గవర్నర్, కేంద్ర మంత్రి, ఎంపీగా వివిధ పదవులను నిర్వహించిన, మార్గరెట్ అల్వా ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ఇక మార్గరెట్ అల్వా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. కీలకమైన పదవీ బాధ్యతలను నిర్వహించారు. అలాగే పార్టీలో కూడా కీలక పదవులను అధిరోహించారు.
ర్ణాటకలోని మంగళూరులో పుట్టిన మార్గరెట్ అల్వా 1969లో రాజకీయాల్లోకి వచ్చారు. 1975, 1977 మధ్య అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా, తర్వాత కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. 1984-85 మధ్య పలుశాఖలకు కేంద్ర మంత్రిగాను సేవలందించారు. 1999లో ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.