Site icon Prime9

Mandous Cyclone : తీరం దాటిన మాండూస్‌… బీభత్సం సృష్టిస్తున్న వర్షం !

mandous-cyclone-has-weakened-into-a-low-pressure

mandous-cyclone-has-weakened-into-a-low-pressure

Mandous Cyclone : మాండూస్‌ తుపాన్ మహాబలిపురం దగ్గర తీరం దాటింది. ఈ తుపాన్ ప్ర‌భావంతో ఏపీలోని రాయ‌ల‌సీమ‌, కోస్తాంధ్ర లోని ప‌లు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు ప‌డుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్ర‌భావంతో… శుక్ర‌వారం రాత్రి నుంచి ప్ర‌కాశం, నెల్లూరు, తిరుప‌తి, చిత్తూరు, అన్న‌మ‌య్య‌, వైఎస్ఆర్ జిల్లాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. కాగా ప్రస్తుతం ప‌శ్చిమ వాయువ్య దిశ‌గా ప‌య‌నిస్తూ శ‌నివారం సాయంత్రం నాటికి వాయుగుండంగా బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశం ఉంది. ఈ నేపధ్యంలో ద‌క్షిణ ఏపీలోని ప‌లు జిల్లాల్లో అతిభారీ నుంచి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు.

మాండూస్‌ ఎఫెక్ట్ కారణంగా మహాబలిపురం తీరం దగ్గర తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇక పెనుగాలుల ధాటికి తీరంలో మత్స్యకారుల బోట్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు తుపాను కారణంగా నలుగురు మృతి చెండినట్లు సమాచారం అందుతుంది. రేప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విప‌త్తుల సంస్థ అధికారులు వెల్ల‌డించారు. తుపాను కార‌ణంగా నెల్లూరు జిల్లా నాయుడుపేట‌, గూడూరు, సూళ్లూరుపేట‌లో భారీ వ‌ర్షం కురుస్తుంది. ఈదురు గాలుల‌తో ప‌లు ప్రాంతాల్లో చెట్లు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. తిరుప‌తి జిల్లాలో వ‌ర్షాల కార‌ణంగా సువ‌ర్ణ‌ముఖి న‌దికి వ‌ర‌ద‌నీరు చేరుతుంది. ఏర్పేడు మండలం కొత్త‌వీరాపురం వ‌ద్ద కాజ్‌వేపై వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హిస్తుంది. ఏర్ప‌డు – మోదుగుల‌పాలెం ర‌హ‌దారిపై రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

అలానే శ్రీ‌కాళ‌హ‌స్తి – పాపానాయుడుపేట- గుడిమ‌ల్లం ర‌హ‌దారిపై వ‌ర‌ద‌నీరు ప్ర‌వ‌హిస్తుంది. తిరుప‌తి న‌గ‌రంలో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మయం అవ్వడంతో ఘాట్ రోడ్డులో వాహ‌న‌దారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. న‌గ‌రంలోని ల‌క్ష్మీపురం స‌ర్కిల్‌, రామానుజ స‌ర్కిల్‌, అన్న‌మ‌య్య స‌ర్కిల్‌, ప‌ద్మావ‌తి పురం, లీల‌మ‌హ‌ల్‌, వెస్ట్ చ‌ర్చి త‌దిత‌ర ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కార‌ణంగా జ‌ల‌మ‌యం అయ్యాయి. ఇక ఒంగోలు, సింగరాయకొండ, జరుగుమల్లి, కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎన్డిఆర్ఎఫ్, ఏపీ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు తుపాను సహాయక చర్యలు చేపడుతున్నారు. తుఫాన్ ప్రభావంతో నరసాపురం తీరం వెంబడి పెను గాలులు, చిరు జల్లులు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

కాగా మాండూస్ తుపాను పరిస్థితి గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో తుపాను ప్రభావంపై సీఎం ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని, అదే విధంగా నిత్యవసర సరుకులను కూడా అందుబాటులో ఉంచాలని తెలిపారు.

Exit mobile version