Manda Krishna Madiga: మాలలు అంబేద్కర్‌ను అవమానిస్తున్నారు – సింహగర్జనపై మందకృష్ణ మాదిగ ఫైర్

  • Written By:
  • Updated On - December 3, 2024 / 06:05 PM IST

Manda Krishna Madiga: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని దేశంలో ముందుకు నడిపించేది మాదిగలేనని ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ అన్నారు. మాలల సింహగర్జనపై మందకృష్ణ ఫైర్ అయ్యారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ తన జీవిత కాలం దళితుల విముక్తి కోసం పాటుపడ్డారని అన్నారు.

దళిత వర్గాల్లో ఎదిగిన మాల వర్గం అంబేద్కర్ స్ఫూర్తికి భిన్నంగా సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు నడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయ పోరాటానికి అడ్డు పడేవారిని మనువాదులుగా నాడు అంబేద్కర్ పోల్చారన్నారు. అయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడేది మాలల్లో ఉండే కొందరు స్వార్థపరులు అని, ఆ స్వార్థపరులే మనువాదులు అని ఆయన విమర్శించారు.

వివేక్ కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలి..

స్వార్థపరులైన మాలలు అంబేద్కర్ వారసులు కాదని, అంబేద్కర్‌ను అవమానిస్తున్నారని ఆరోపించారు. మనువాదుల సంఖ్య మాలల్లో పెరిగిందన్నారు. దళితుల్లో ఎదిగిన వర్గం మిగిలిన వర్గాల హక్కులను హరించడానికి కుట్రలు చేస్తున్నప్పుడు వారు అంబేద్కర్ వ్యతిరేకులేనన్నారు. వివేక్ వెంకటస్వామికి ఎస్సీ వర్గీకరణకు అడ్డు తగిలే శక్తిగా ఉంటే ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే పార్టీలో చేరాలని వ్యాఖ్యానించారు.